మద్యం కుంభకోణం కేసులో (Delhi Liquor scam case) ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు ఊరట లభించింది. ఎట్టకేలకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టుకు ఆయన హాజరయ్యారు. విచారణ చేపట్టిన రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. రూ.15వేల వ్యక్తిగత బాండ్‌తో పాటు రూ.లక్ష సెక్యూరిటీ డిపాజిట్ చేయాలని ఆదేశించింది.
దీంతో కోర్టు నుంచి అరవింద్ కేజ్రీవాల్ వెళ్లిపోయారు. అయితే, కేజ్రీవాల్‌కు దర్యాప్తు సంస్థ (ఈడీ) జారీ చేసిన సమన్లను పాటించలేదన్న ఫిర్యాదులపై ఇవాళ(శనివారం) హాజరు కావాలని రోస్ అవెన్యూ కోర్టు (మేజిస్ట్రేట్ కోర్టు) కోరింది. అరవింద్ కేజీవాల్ తరఫున ఇద్దరు న్యాయవాదులు రమేష్ గుప్తా, రాజీవ్ మోహన్ వాదనలు వినిపించారు.
ఇక, అరవింద్ కేజ్రీవాల్ కోర్టుకు వెళ్లే క్రమంలో అక్కడ భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు కోర్టు చుట్టూ ఉన్న పలు మార్గాలను దారి మళ్లించారు. దీంతో పాటు ఆయా మార్గాల్లో వచ్చే ప్రజలు సకాలంలో రావాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. అయితే, ఇప్పటికే ఈడీ అధికారులు ఢిల్లీ సీఎంకు ఎనిమిది సార్లు సమన్లు జారీ చేసిన కేజీవాల్ వెళ్లలేదు.
ఇక, తాము జారీ చేసిన సమన్లకు అరవింద్ కేజ్రివాల్ స్పందించలేదని ఈడీ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో మరోసారి పిటిషన్ వేశారు. దీంతో తాజాగా ఆయన రోస్ అవెన్యూ కోర్టులో విచారణకు హాజరయ్యారు. ఢిల్లీ ఎక్సెజ్ పాలసీ కేసులో అనేక సార్లు సమన్లు జారీ చేసినప్పటికీ దర్యాప్తు సంస్థ ముందు హాజరుకావడం లేదని ఈడీ ఆరోపించింది. కేజ్రీవాల్ తరపు న్యాయవాది వాదనలకు కోర్టు ఏకీభవించడంతో ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.