ఆమ్ ఆద్మీ పార్టీ (APP) అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) ఇంటికి ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు(Delhi Police) వెళ్లారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను బీజేపీ కొనేందుకు ప్రయత్నిస్తోందని కేజ్రీవాల్ చేసిన ఆరోపణల నేపథ్యంలో అందుకు ఆధారాలు ఇవ్వాలని సీఎంను పోలీసులు కోరనున్నట్లు తెలుస్తోంది.
తమ పార్టీ ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభాలకు గురి చేస్తోందంటూ కేజ్రీవాల్ ఇటీవలే సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఏడుగురు ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి రూ.25 కోట్లు చెప్పున ఆఫర్ చేసిందంటూ సోషల్ మీడియా వేదికగా కేజ్రీవాల్ తీవ్ర విమర్శలు చేశారు. ఈ ఆరోపణలపై బీజేపీ నేతలు జనవరి 30వ తేదీన ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
అయితే, స్వయంగా సీఎంకు నోటీసులు అందజేసేందుకు కేజ్రీవాల్ అధికారిక నివాసానికి శనివారం ఉదయం పోలీసులు చేరుకున్నారు. కాగా, ఇందులో భాగంగా ఎమ్మెల్యేల ప్రలోభాల వ్యవహారంలో ఆధారాలు ఇవ్వాలని కోరుతూ కేజ్రీవాల్‌కు నోటీసులు ఇచ్చేందుకు ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసుల బృందం శుక్రవారం రాత్రి సీఎం నివాసానికి వెళ్లింది. సుమారు గంటపాటు వేచి చూసి.. చివరికి నోటీసులు ఇవ్వకుండానే పోలీసులు వెనుదిరిగారు.
నోటీసులు తీసుకునేందుకు కేజ్రీవాల్ నిరాకరించినట్లు సమాచారం. అయితే, నోటీసులు తీసుకునేందుకు ఆప్ అధినేత సిద్ధంగా ఉన్నా ఇవ్వకుండా వెళ్లిపోయారని సీఎం కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. సీఎంతో పాటు మంత్రి అతిషి ఇంటికి కూడా పోలీసులు వెళ్లారు. మంత్రి అతిషి మాత్రం అందుబాటులో లేరని తెలిపారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం మరోసారి ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ బృందం సీఎం నివాసానికి వెళ్లింది.