ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Delhi Liquor Scam)లో సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Aravind Kejriwal) మరోసారి ఈడీ విచారణకు గైర్హాజరయ్యారు. ప్రస్తుతం ఈ అంశం న్యాయస్థానం పరిధిలో ఉందని ఆప్ పేర్కొంది. బీజేపీపై అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు.
ఈడీని మూసి వేస్తే, మనీలాండరింగ్ చట్టంలోని సెక్షన్ 45ను రద్దు చేస్తే చాలా మంది బీజేపీ నేతలు ఆ పార్టీని వీడతారని అన్నారు. అలా చేస్తే ఆ పార్టీ సీనియర్ నేతలు శివరాజ్ సింగ్ చౌహాన్, వసుంధర రాజే సిందియా లాంటి వాళ్లు కొత్త పార్టీ పెట్టుకుంటారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ నేత, న్యాయవాది అభిషేక్ సింఘ్వీ నివాసంలో లంచ్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఇప్పటి వరకు ఆయన ఆరు సార్లు ఈడీ నోటీసులను ధిక్కరిస్తూ విచారణకు గైర్హాజరు అయ్యారు.
ఈడీ సమన్లు చట్టవిరుద్ధమైనవని ఆప్ నేత చెబుతూ వస్తున్నారు. ఈ సమన్లు కేవలం రాజకీయ ప్రేరేపితమైనవని కేజ్రీవాల్ విమర్శించారు. తనను ఎన్నికల్లో ప్రచారం చేయకుండా అడ్డుకునేందుకే ఈ సమన్లను పంపించినట్లు ఆయన ఆరోపించారు. ఈ కేసులో ఆప్ కీలక నేతలైన సత్యేందర్ జైన్, మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్‌లను ఈడీ అరెస్ట్ చేసి, జైలులో వేసింది.