కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP)లపై ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ ది జూటా సెక్యులరిజం అని తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. కాంగ్రెస్‌ది కేవలం పొలిటికల్ సెక్యులరిజం మాత్రమేనన్నారు. కాంగ్రెస్, బీజేపీలు రెండూ ఒక్కటేనని ఆయన దుయ్యబట్టారు. బాబ్రీ మసీద్ కూల్చివేతలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ లాగే కాంగ్రెస్ పాత్ర కూడా ఉందని ఆరోపణలు గుప్పించారు.
ముస్లింలు మందిరాలను కూల్చివేశారని సుప్రీంకోర్టు ఎక్కడా చెప్పలేదన్నారు. అజారుద్దీన్ కాంగ్రెస్ అభ్యర్థి అని, ఆయనతో తనకు ఎలాంటి సంబంధము లేదన్నారు. అజారుద్దీన్ సోదరులు తనకు స్నేహితులని వెల్లడించారు. జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ అభ్యర్థిని ఓడిస్తామన్నారు. అక్కడ ఖచ్చితంగా ఎంఐఎం గెలుస్తుందని తెలిపారు. అంబర్ పేట నుంచి పోటీ చేయకుండా కిషన్ రెడ్డి ఎందుకు పారిపోయారని నిలదీశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ హయాంలో 11 సార్లు కర్ఫ్యూ విధించారని పేర్కొన్నారు. కేసీఆర్ హయాంలో రెండుసార్లు కర్ఫ్యూ విధించారని అన్నారు. అందులో ఒకసారి కరోనా సమయంలో అని చెప్పారు. 2014 నుంచి అభివృద్ధిలో తెలంగాణ దూసుకెళ్తోందన్నారు.తెలంగాణలో మరోసారి బీఆర్ఎస్ గెలుస్తుందన్నారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. బీఆర్ఎస్కే తమ పూర్తి మద్దతు ఉంటుందన్నారు.
బీజేపీ తెలంగాణ చీఫ్ పదవి నుంచి బండి సంజయ్‌ను తొలగించారని, ఇప్పుడేమో బీసీ సీఎం అంటున్నారని బీజేపీపై విమర్శలు గుప్పించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై డ్యాం సేఫ్టి అథారిటీ ఇచ్చిన నివేదికను తాను ఇంకా చదవలేదన్నారు. మరమ్మతులకు అయ్యే ఖర్చు నిర్మాణ సంస్థ భరిస్తుందని కేటీఆర్ చెప్పారని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర ఖజానాపై ఎలాంటి భారం ఉండబోదని తెలిపారు.