ఎంఐఎం(MIM) అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ(MP Asaduddin Owaisi) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇల్లాలితో ఎలా నడుచుకోవాలనే విషయాన్ని తెలిపారు. భార్య( wife)పై కోపం వెళ్లగక్కడం పౌరుషం (manhood) అనిపించుకోదని చెప్పారు. ఆమె కోపాన్ని తట్టుకోవడమే నిజమైన పౌరుషం అని వివరించారు. పార్టీ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

అనవసరంగా మీ భార్యపై కోపం వెళ్లగక్కడం పౌరుషం కాదన్నారు. ’’ఇక్కడ కొంతమంది తమ భార్యలు ఎదురుతిరిగి సమాధానం చెబితే మనస్తాపం చెందుతారు. చాలా మంది రాత్రి వరకు స్నేహితులతో కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. వారి భార్యలు, పిల్లలు, తల్లులు వారి కోసం ఇంట్లో
ఎదురుచూస్తుంటారు. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి‘‘ అని అసదుద్దీన్ ఓవైసీ కోరారు.
భార్యలతో మగవారు మంచిగా నడుచుకోవాలని అసదుద్దీన్ ఓవైసీ సూచించారు. “నేను ఈ విషయాన్ని చాలాసార్లు చెప్పాను. మీ భార్య మీ బట్టలు ఉతకాలి, మీకు వంట చేయాలి, మీ తలకు మసాజ్ చేయాలి అని ఖురాన్ చెప్పలేదు. వాస్తవానికి భార్య సంపాదనపై భర్తకు హక్కు లేదు. కానీ, భర్త సంపాదనపై భార్యకు హక్కు ఉంటుంది.. ఎందుకంటే ఆమె ఇంటిని నడపాల్సి ఉంటుంది” అని ఆయన పేర్కొన్నారు.