Telugu News » Rahul Gandhi : వద్దన్న పనే చేస్తున్న రాహుల్ గాంధీ.. ఎందుకిలా..?

Rahul Gandhi : వద్దన్న పనే చేస్తున్న రాహుల్ గాంధీ.. ఎందుకిలా..?

యాత్రలో రాహుల్ ప్రవర్తనపై బీజేపీ నేతలు భగ్గుమంటున్నారు. సమస్యలు తలెత్తుతాయని ముందే చెప్పినా వినిపించుకోకుండా ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారని.. కాంగ్రెస్ కు కావాల్సింది విధ్వంసమేనా? అని నిలదీస్తున్నారు.

by admin
Assam CM asks police to file case against Rahul Gandhi

– రాహుల్ గాంధీ యాత్రలో మరోసారి ఉద్రిక్తత
– గువాహటిలోకి అనుమతి లేకపోయినా యాత్ర
– పోలీసుల బారికేడ్లు తోసేసి రచ్చ
– హస్తం శ్రేణుల తీరుపై సీఎం హిమంత శర్మ సీరియస్
– ఇవన్నీ నక్సల్స్ వ్యూహాలు అంటూ ఆగ్రహం
– శాంతియుత రాష్ట్రంలో విధ్వంసం సృష్టించాలనుకుంటున్నారా?
– రాహుల్ గాంధీపై బీజేపీ ఫైర్

ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ముందు భారత్ జోడో యాత్ర అంటూ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా నడిచారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ. ఇప్పుడు లోక్ సభ ఎన్నికలకు ముందు భారత్ జోడో న్యాయ్ యాత్ర పేరుతో మణిపూర్ నుంచి ముంబై దాకా యాత్ర చేస్తున్నారు. ఇవన్నీ ఓట్ల కోసం కాదని.. ప్రజల్ని ఏకం చేసేందుకేనని హస్తం నేతలు చెబుతున్నా.. ఇవి ముమ్మాటికీ రాజకీయ యాత్రలేనని బీజేపీ నేతలు అంటున్నారు. పైగా, స్థానిక రాష్ట్ర ప్రభుత్వాలు, పోలీసుల మాట వినకుండా రాహుల్ గాంధీ ప్రవర్తిస్తున్న తీరు ఉద్రిక్తతలకు దారి తీస్తోందని మండిపడుతున్నారు.

Assam CM asks police to file case against Rahul Gandhi

ప్రస్తుతం రాహుల్ యాత్ర బీజేపీ పాలిత రాష్ట్రమైన అసోంలో జరుగుతోంది. మంగళవారం గువాహటిలో పర్యటించాలని ప్లాన్ చేశారు. కానీ, పోలీసులు అందుకు అంగీకరించలేదు. నగరంలోకి యాత్ర ప్రవేశించకుండా అడ్డుకోవడంతో ఆందోళనకు దారితీసింది. పోలీసులు అడ్డుగా పెట్టిన బారికేడ్లను తోసుకుంటూ కాంగ్రెస్ కార్యకర్తలు ముందుకు దూసుకెళ్లారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది.

ట్రాఫిక్ సమస్య తలెత్తే ప్రమాదం ఉన్న నేపథ్యంలో గువాహటిలోకి యాత్రను అనుమతించలేమని అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ఇదివరకే పేర్కొన్నారు. కానీ, కాంగ్రెస్ కార్యకర్తలు ఖానాపారాలోని గువాహటి చౌక్​ వద్దకు భారీగా చేరుకున్నారు. పార్టీ అనుకూల నినాదాలు చేస్తూ రాహుల్​ కు స్వాగతం పలికారు. తర్వాత పోలీసుల బారికేడ్లను తోసేస్తూ రచ్చ చేశారు. అయితే.. బ్యారికేడ్లు మాత్రమే ఛేదించుకొని వెళ్లామని, చట్టాన్ని అతిక్రమించబోమని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.

ఈ ఘటనపై సీఎం శర్మ స్పందించారు. యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు బీవీ శ్రీనివాస్ చేసిన ట్వీట్ ను రీట్వీట్ చేస్తూ కౌంటర్ ఇచ్చారు. రాహుల్ యాత్రపై కుట్ర జరుగుతోందని.. కానీ, తమ యుద్ధం ఆగదని శ్రీనివాస్ ట్వీట్ చేయగా.. ఇలాంటి నక్సల్స్ వ్యూహాలు అసోం సంస్కృతిలో భాగం కాదని అన్నారు హిమంత శర్మ. తమది శాంతియుత రాష్ట్రమని తెలిపారు. రాహుల్ గాంధీపై కేసు నమోదు చేయాలని అసోం డీజీపీని ఆదేశించినట్టు పేర్కొన్నారు. మీ వికృత చర్యల వల్ల గువాహటిలో ట్రాఫిక్ జామ్ సమస్య తలెత్తిందని మండిపడ్డారు.

సోమవారం అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ సంబరాలు జరుగుతున్న సమయంలో కూడా రాహుల్ యాత్రలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్థానికంగా ఉన్న ఓ ఆలయంలోకి తర్వాత వెళ్లమని రాహుల్ గాంధీకి ముందే చెప్పినా ఆయన ఊరుకోలేదు. దర్శనానికి వెళ్లి తీరాల్సిందేనని పట్టుబట్టారు. దీంతో ఆయన్ను ఆలయం దగ్గరకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టిన నేపథ్యంలో ఇబ్బందులు తలెత్తుతాయని చెప్పారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాతే అనుమతి ఉంటుందని చెప్పారు. పోలీసుల చర్యతో కాంగ్రెస్ శ్రేణులతో కలిసి రాహుల్ గాంధీ నిరసనకు దిగారు. యాత్రలో రాహుల్ ప్రవర్తనపై బీజేపీ నేతలు భగ్గుమంటున్నారు. సమస్యలు తలెత్తుతాయని ముందే చెప్పినా వినిపించుకోకుండా ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారని.. కాంగ్రెస్ కు కావాల్సింది విధ్వంసమేనా? అని నిలదీస్తున్నారు.

You may also like

Leave a Comment