అసెంబ్లీ ఎన్నికల (Assembly Election) నామినేషన్ (Nomination) కోసం ఒక్క రోజే సమయం ఉండటంతో రాష్ట్రంలో నేతల హడావుడి మొదలైంది. ఇప్పటి వరకు నామినేషన్ వేయని నేతలు.. నామినేషన్ వేసేందుకు పరుగులు తీస్తున్నారు. ఈ నేపథ్యంలో చెన్నూరు ఆర్డీవో ఆఫీస్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.
నామినేషన్ వేసేందుకు చెన్నూర్ (Chennur) బీఆర్ఎస్ (BRS) అభ్యర్థి బాల్క సుమన్ (Balka Suman) ఆర్డీవో కార్యాలయానికి వెళ్లారు. అదే సమయంలో కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి అక్కడికి చేరుకోవడంతో హైటెన్షన్ నెలకొంది. మరోవైపు నామినేషన్ దాఖలు చేయటానికి ఆఫీసుకు వెళ్ళిన వివేక్ వెంకటస్వామి కాన్వాయ్ ని పోలీసులు దూరంగా నిలిపివేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ వాహనాలను మాత్రం రిటర్నింగ్ ఆఫీస్ దగ్గరికి అనుమతించారు.
దీంతో ఒక్కసారిగా ఆర్డీవో ఆఫీస్ దగ్గర వాతావరణం వేడెక్కింది. బాల్క సుమన్ పట్ల ఒకవిధంగా.. వివేక్ పట్ల మరో విధంగా పోలీసులు ప్రవర్తించడంతో కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు వివేక్ సైతం పోలీసు అధికారితో వాగ్వాదానికి దిగారు. ఈ ఘటన పై వివేక్ వెంకటస్వామి (Vivek Venkataswamy) మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ గూండాయిజం ఏంటో ఇక్కడే స్పష్టంగా.. అందరి కళ్లకు కనిపించిందని విమర్శించారు.. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా పోలీసులు బాల్క సుమన్ కు రాచమర్యాదలు చేయడం.. రాష్ట్రంలో బీఆర్ఎస్ గుండాయిజానికి అద్దం పడుతుందని వివేక్ మండిపడ్డారు.