నాలుగు గింజలకు ఆశపడి వేటగాడి వలలో పక్షులు చిక్కినట్టు.. బోనులో ఎలుకలు పడ్డట్టు జనం రాజకీయ నేతలు ఇచ్చే హామీలకు అలవాటు పడుతున్నారని మేధావులు గొంతుపగిలేలా అరచి గీ పెడుతున్నారు.. అయినా చీమ కుట్టినట్టు కూడా పట్టించుకోవడం లేదు జనం అని అనుకుంటున్నారు. రాజకీయ చదరంగం అంతా కళ్ళముందు జరుగుతున్నా.. రాజకీయ జీవితం ఆరంభంలో బికారిగా ఉండి.. క్రమ క్రమంగా కోట్లకు పడగలెత్తుతున్న వారు కల్లబొల్లి మాటలు చెప్పిన నమ్మే స్థితిలోకి మనిషి జారడం తన గొయ్యి తానే తీసుకున్నట్టుగా మేధావులు వర్ణిస్తున్నారు.
ఇక తెలంగాణ (Telangana)లో జరిగే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నేతలంతా విమర్శలు చేసుకుంటూ ప్రచారాల్లో బిజీగా ఉన్నారు.. ఈ క్రమంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) ఉమ్మడి ఖమ్మం జిల్లాలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మర్లపాడులో కాంగ్రెస్ నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న భట్టి.. బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు చేశారు.. కొంతమంది పారిశ్రామికవేత్తలు వెదజల్లిన డబ్బు సంచులతో బీఆర్ఎస్ ప్రభుత్వం గెలవాలని చూస్తుందని భట్టి ఆరోపణలు చేశారు..
సత్తుపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ కి కంచుకోటని తెలిపిన భట్టి.. కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ రాగమయి దయానంద్ ప్రజా సేవకు అంకితం అయిన నాయకులని అన్నారు.. కాంగ్రెస్, తెలుగుదేశం ప్రభుత్వాల హయాంలలో మాత్రమే ఇక్కడ అభివృద్ధి జరిగిందని, గత పది సంవత్సరాల నుంచి ఇక్కడ ఒక్క అభివృద్ధి పని జరగలేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో దోచుకోవడం, దాచుకోవడం తప్పితే సంక్షేమం అనే ఆలోచనే లేదని భట్టి మండిపడ్డారు..
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అందరూ భారీ మెజారిటీతో విజయం సాధిస్తారని భట్టి ధీమా వ్యక్తం చేశారు.. ప్రతి రైతుకు ఎకరానికి రూ.15000 ఇస్తామని, రైతు కూలీలకు రూ.12000 వేలు, ఇల్లు నిర్మాణానికి ఐదు లక్షలు ఇస్తామని, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ అందజేస్తామని, నిరుద్యోగం లేకుండా చేస్తామని, 200 యూనిట్ల విద్యుత్ ఉచితంగా అందిస్తామని భట్టి విక్రమార్క కాంగ్రెస్ హామీల గురించి వివరించారు. సత్తుపల్లి కాంగ్రెస్ అభ్యర్థి రాగమయిని ఆశీర్వదించి భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.