తెలంగాణ (Telangana)లో మొత్తానికి ఎన్నికల యుద్ధం ముగిసింది. అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు జరిగిన చాలా చోట్ల పోలింగ్ ప్రశాంతంగా జరిగినట్టు అధికారులు తెలిపారు. సుమారుగా 3 కోట్లకు పైగా ఓటర్లు.. తమ తీర్పును ఈవీఎం (EVM)లలో నిక్షిప్తం చేశారు. కాగా బరిలో ఉన్న అభ్యర్థుల భవితవ్యం ఆదివారం తేలనుంది. కాగా ఈ ఎన్నికల్లో మొత్తం 2,290 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అందులో 2068 మంది పురుషులు, 221 మంది మహిళలు కాగా.. ఒక ట్రాన్స్జెండర్ ఉన్నారు.
బీఆర్ఎస్ (BRS) మొత్తం 119 స్థానాల్లో పోటీ చేయగా.. కాంగ్రెస్ (Congress) 118 చోట్ల, బీజేపీ (BJP) 111 చోట్ల పోటీ చేశాయి. బీజేపీ మిత్రపక్షం జనసేన 8 స్థానాల్లో బరిలో నిలిచింది. సీపీఎం (CPM) 19, సీపీఐ ఒకచోట, బీఎస్పీ నుంచి 108 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇతర పార్టీలు, స్వతంత్రులు పెద్ద సంఖ్యలో పోటీలో నిలిచారు. అత్యధికంగా ఎల్బీనగర్‌లో 48 మంది పోటీ చేస్తుండగా.. అత్యల్పంగా నారాయణపేట, బాన్సువాడల్లో కేవలం ఏడుగురు మాత్రమే బరిలో నిలిచారు.
ఇక సిర్పూర్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వరావుపేట, భద్రాచలం నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసింది. మిగిలిన 106 నియోజకవర్గాల్లో.. సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ కొనసాగింది. రాష్ట్రవ్యాప్తంగా 35,655 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ నిర్వహించారు. దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 80 ఏళ్లు పైబడిన వారికి ఉచిత రవాణా సదుపాయం కల్పించారు.
మరోవైపు రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3 కోట్ల 26 లక్షల 2 వేల 799 కాగా.. కోటీ 62 లక్షల 98 వేల 418 మంది పురుషులు ఉన్నారు. కోటీ 63 వేల 1705 మంది మహిళలు ఉన్నారు. ట్రాన్స్జెండర్లు 2,676 మంది ఉన్నారు. సర్వీసు ఓటర్ల సంఖ్య 15,406 కాగా.. ప్రవాస ఓటర్లు 2,944 మంది ఉన్నారు. 18 నుంచి 19 ఏళ్ల వయస్సు వారు 9 లక్షల 99 వేల 667 మంది ఉన్నారు.. మరోవైపు సాయంత్రం 5 గంటల వరకు 63.94 శాతం పోలింగ్ నమోదైందని సమాచారం..
అభ్యర్థుల సంఖ్యను దృష్టిలో పెట్టుకొని అధికారులు.. 59 వేల 779 బ్యాలెట్ యూనిట్లను పోలింగ్ కోసం వినియోగించారు. రిజర్వ్ బ్యాలెట్ యూనిట్లు కలిపి మొత్తం 75 వేల 464 బ్యాలెట్ యూనిట్లు అందుబాటులో ఉంచారు. 44 వేల 828 కంట్రోల్ యూనిట్లు, 49 వేల 460 వీవీప్యాట్ యంత్రాలను ఎన్నికల్లో వినియోగించారు. ఈవీఎం యంత్రాలకు ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తితే వెంటనే సరి చేసేందుకు వీలుగా 400కు పైగా ఈసీఐఎల్ ఇంజినీర్లు ను సిద్దంగా ఉంచారు..