తెలంగాణ (Telangana)లో అసెంబ్లీ ఎన్నికలు (Assembly-Elections) సమీపిస్తుండటంతో నేతల మధ్య మాటల యుద్ధం పీక్ స్టేజ్‌కు చేరుకుంటోంది. ఇప్పటికే బీఆర్ఎస్ (BRS) అవినీతిలో కూరుకు పోయిందని కాంగ్రెస్(Congress), బీజేపీ (BJP)నేతలు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. ఇందుకు ధీటుగా బీఆర్ఎస్ నేతలు కూడా సమాధానం చెబుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ నేత తుమ్మల నాగేశ్వర్ రావు, బీఆర్ఎస్ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ (Puvvada Ajay Kumar)పై ధ్వజం ఎత్తారు..
పువ్వాడ కాంట్రాక్టర్లను బెదిరించి.. ఆ పనులను వేరే వారికి అమ్ముకున్నారని తుమ్మల ఆరోపించారు. ఖమ్మంలో దోపిడి ముఠాను తయారు చేసిన పువ్వాడ.. ప్రజల భూములు కబ్జా చేసి అక్రమంగా సంపాదిస్తున్నారని, ఆస్తులను పాముల పుట్టాలా పెంచుకుంటున్నాడని ఆరోపించారు. మరోసారి పువ్వాడ అజయ్ ని గెలిపిస్తే ఖమ్మంలో ఆరాచకాలకు దోపిడీకి అవకాశం ఇచ్చినట్టే అని తుమ్మల విమర్శించారు.
ఖమ్మంలో ఉన్న గుట్టలు మాయం చేసి మట్టి దోచుకున్నారని పువ్వాడపై మండిపడ్డారు తుమ్మల. ప్రతీ దాంట్లో కమీషన్లు దండుకుంటున్న పువ్వాడ కావాలో.. అరాచకాలు, దోపిడికి తావివ్వని తాను కావాలో ఆలోచించి ఓటు వేయండని తుమ్మల తెలిపారు. ఒకప్పుడు సరైన దారి కూడా లేని ఖమ్మం మార్కెట్ ని కాంగ్రెస్ హయాంలో అభివృద్ధిచేశామన్నారు తుమ్మల. రాబోయే ఎన్నికల్లో తనను గెలిపిస్తే మోడల్ మార్కెట్ చేస్తానని, మార్కెట్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటా అని తుమ్మల నాగేశ్వర్ రావు (Tummala Nageswara Rao) తెలిపారు.