తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ శాసనసభలకు జరిగిన ఎన్నికల(Assembly Elections) కౌంటింగ్(Counting) ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కాగా అధికారులు తొలుత పోస్టల్ బ్యాలెట్(Postal Balet) ఓట్లను లెక్కించి ఆ తర్వాత ఈవీఎం ఓట్లను లెక్కిస్తున్నారు.
ఆయా రాష్ట్రాల్లో ఇప్పటివరకు జరిగిన కౌంటింగ్ సరళిని చూస్తే మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గడ్‌లో బీజేపీ సత్తా చాటుతోంది. ఇందులో ఛత్తీస్‌గడ్‌లో కాంగ్రెస్, కాషాయ పార్టీ మధ్య హోరాహోరీ పోటీ తలపిస్తోంది. మధ్యప్రదేశ్‌లో ఆధిక్యంలో బీజేపీ మ్యాజిక్ ఫిగర్‌ను దాటి ప్రస్తుతతం 148 స్థానాల్లో ఆధిక్యతతో కొనసాగుతోంది. కాంగ్రెస్ 58 చోట్ల.. ఇతరులు 2 చోట్ల ముందంజలో ఉన్నారు.
మరోవైపు రాజస్థాన్‌లో బీజేపీ అధికారం చేజిక్కించుకునే దిశగా సాగుతోంది. 107స్థానాల్లో ఆధిక్యతను ప్రదర్శిస్తోంది. కాంగ్రెస్ పార్టీ 72స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇతరులు సుమారు 20 చోట్ల ఆధిక్యం కనబరుస్తున్నారు.
ఛత్తీస్గడ్ మాత్రం హోరా హోరీ పోరు కొనసాగుతోంది. ఆధిక్యం కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్య దోబూచులాడుతోంది. బీజేపీ 48స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అదే స్థాయిలో కాంగ్రెస్ గట్టి పోటీనిస్తూ 42స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తోంది. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ 66స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా అధికార బీఆర్ఎస్ 39స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.