హైదరాబాద్(Hyderabad) పేరుతో వైసీపీ నేతలు మరో కొత్త నాటకానికి తెరలేపారని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు(Atchannaidu) విమర్శించారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. మూడు రాజధానుల పేరిట మూడు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టారని, మూడు ప్రాంతాల్లో బినామీ ఆస్తులు పోగేసుకున్నారని ఆరోపించారు.
బినామీ ఆస్తులు కాపాడుకోవడానికే వైవీ సుబ్బారెడ్డి ఉమ్మడి హైదరాబాద్ రాగం అందుకున్నారని విమర్శించారు. విశాఖలో జగన్‌రెడ్డి రూ.40వేల కోట్ల బినామీ ఆస్తుల్ని కూడగట్టుకున్నారని, అందుకే ఇప్పటి వరకు విశాఖే రాజధాని అని చెబుతూ వస్తున్నారని తెలిపారు. ఇప్పుడు హైదరాబాద్‌లోని బినామీ ఆస్తుల కోసం కొత్త నాటకానికి తెరలేపారంటూ దుయ్యబట్టారు.
గతంలో అమరావతికి 30 వేల ఎకరాలుండాలన్న జగన్.. ఇక్కడే ఇల్లు కట్టుకున్నాని, అమరావతిని పూర్తి చేస్తానని ప్రజలను నమ్మించి మోసం చేశాడని మండిపడ్డారు. ఏపీ యువతకు ఉద్యోగ, ఉపాధి విషయంలో జగన్ ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందని ఆరోపించారు. కర్నూలు న్యాయ రాజధాని అని చెప్పి కర్నూలుకు హైకోర్టు బెంచి రాకుండా చేశారని అన్నారు.
జగన్ రెడ్డి అరాచకం స్థాయి రాజధాని ఫైల్స్ సినిమా చూస్తే అర్థమవుతుందన్నారు. 60 రోజుల తర్వాత టీడీపీ అధికారంలోకి వస్తుందని అచ్చెన్నాయుడు ధీమా వ్యక్తంచేశారు. అప్పుడు తప్పకుండా అమరావతిని పూర్తి చేస్తామని, అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసి చూపుతామని తెలిపారు. రాష్ట్రాన్ని ప్రపంచంలో అగ్రస్థానంలో నిలుపే బాధ్యత తమదని తెలిపారు.