బీసీ నేతలను ఇరికించేందుకు జగన్ కుట్ర చేస్తున్నాడని టీడీపీ రాష్ట్ర చీఫ్ అచ్చెనాయుడు(TDP state chief Atchannaidu) ఆరోపించారు. కత్తి డ్రామాలో ఎస్సీ బిడ్డను ఐదేళ్లు జైలు పాలు చేశారని, ఇప్పుడు మళ్లీ జగన్‌పైగా గులకరాయి డ్రామాలో బీసీ నేత సతీశ్‌ను ఇరికించాలని చూస్తున్నారని మండిపడ్డారు. అసలు జగన్(CM Jagan)పై దాడికి టీడీపీకి సంబంధమేంటని ప్రశ్నించారు.
అధికారంలో ఉన్న వారే దీనికి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. మూడు రోజుల కిందట టీడీపీ కార్యకర్త వేముల దుర్గారావును అదుపులోకి తీసుకుని ఇప్పటి వరకు మీడియా ముందుకు ఎందుకు ప్రవేశపెట్టలేదని అచ్చెన్నాయుడు నిలదీశారు. బోండా ఉమా పేరు చెప్పాలంటూ దుర్గారావును మూడు రోజుల నుంచి చిత్రహింసలు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బోండా ఉమతో పాటు టీడీపీ నేతలను అక్రమంగా ఇరికించే కుట్రపై ఇప్పటికే ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశామని తెలిపారు. తప్పులు మీరు చేసి మాపై కేసులు పెడతామంటే చూస్తూ ఊరుకోమంటూ అచ్చెన్నాయుడు ఆక్షేపించారు. తెలంగాణలో చట్ట విరుద్దంగా ఫోన్ ట్యాపింగ్ చేసి అధికారులు ఏవిధంగా జైలుపాలయ్యారో వైసీపీ నేతలు మాటలు వినే పోలీసుల అధికారులకు గతి అంతే అన్నారు.
తప్పుడు కేసులు పెడుతున్న ఏ ఒక్క పోలీసు అధికారిని వదలమని హెచ్చరించారు. మరో నెల రోజుల్లో ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గులకరాయి కేసులో చట్ట విరుద్దంగా వ్యవహరించిన వారిపై, ఈ డ్రామాను నడిపిన వారిపై కఠిన చర్యలు తప్పవని అచ్చెన్నాయుడు పునరుద్ఘాటించారు.