హైదరాబాద్ (Hyderabad)లోని ముషీరాబాద్ (Mushirabad) గంగపుత్ర కాలనీ ( Gangaputra Colony)లో ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. తమ చిన్నారికి ఉరి వేసి ఆపై దంపతులు కూడా బలవన్మరణానికి పాల్పడ్డారు. కాగా మృతులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా లక్ష్మీపురం గ్రామానికి చెందిన వారని సమాచారం.. ఈ ఘటన వారాసిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
ఆత్మహత్య (Suicide) చేసుకున్న వారు కొప్పుల సాయి కృష్ణ, చిత్రకళ, కూతురు తేజస్విని(4)గా తెలుస్తోంది. మరోవైపు మృతురాలు చిత్రకళ బిర్లా ప్లానిటోరియంలో, భర్త సాయి కృష్ణ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగిగా పనిచేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం సాయికృష్ణను యాజమాన్యం ఉద్యోగంలో నుంచి తీసివేయడంతో రాపిడో నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నాడు.
తాజాగా భార్య చిత్రకళను కూడా బిర్లా ప్లానిటోరియం యాజమాన్యం ఉద్యోగంలో నుంచి తొలగించడంతో మనోవేదనకు గురైనట్టు సమాచారం. మరోవైపు ఆర్థిక సమస్యలు చుట్టుముట్టడంతో వీరు ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రచారం జరుగుతుంది. కాగా ఘటన సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ముగ్గురు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించనున్నట్టు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభిస్తామని అన్నారు.
మరోవైపు ఆత్మహత్యకు ముందు చిత్రకళ గోడపై రాసిన సూసైడ్ నోట్ సంచలనంగా మారింది.. ‘‘నా చావుకి బిర్లా సైన్స్ సెంటర్‌లో వర్క్ చేస్తున్న శ్యామ్ కొఠారి, గీత రావులు కారణం. నేను పని చేస్తున్న సమయంలో నాపై తప్పుడు ఆరోపణలు చేసి జాబ్ నుంచి తొలిగించారు. అపాయింట్మెంట్ లెటర్, పే స్లిప్స్ అడిగినా పట్టించుకోలేదు. వాళ్ళు చేస్తున్న ఫ్రాడ్స్‌ను నిలదీసినందుకు నన్ను ఉద్యోగం నుంచి తొలిగించారు. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్‌కు ఎన్నో సార్లు ట్విట్టర్‌లో మొర పెట్టుకున్నా పట్టించుకోలేదు’’ అంటూ మృతురాలు చిత్రకళ సూసైడ్ నోట్‌లో ఆవేదన వ్యక్తం చేసింది.