కాంగ్రెస్ నేత, మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుపై (mynampalli hanmath rao) మాజీ మంత్రి మల్లారెడ్డి (Mallareddy) తనయుడు భద్రారెడ్డి (Badra reddy) సంచలన ఆరోపణలు చేశారు. మైనంపల్లి గుండాయిజం, రౌడీ రాజకీయాలు చేస్తున్నారని, దౌర్జన్యం చేస్తున్నారని ఆరోపించారు. అయితే, ఇటీవల మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ మీద పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఇంజినీరింగ్ విద్యార్థులకు రాత్రి మెస్‌లో నాణ్యమైన భోజనం పెట్టడం లేదని, పురుగుల అన్నం, బొద్దింకలతో కూడా ఆహారం ఇస్తున్నారని ఇప్పటికే రెండు సార్లు విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు రోడ్డెక్కిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే మల్లారెడ్డి అగ్రికల్చర్ కాలేజీలో 22 మంది విద్యార్థులను డీటెయిండ్ చేసిన కారణంగా కాలేజీలో పెద్దఎత్తున గొడవలు (Attacks) జరిగాయి. ఈ క్రమంలోనే మల్లారెడ్డి తనయుడు భద్రారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు గుండాయిజం చేస్తున్నారని, మంగళవారం సుమారు 100 మందిని తమ ఇనిస్టిట్యూట్ మీదకు పంపించి దాడులు చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా చేయడం కరెక్ట్ కాదన్నారు. కాలేజీలో ఫర్నిచర్ ధ్వంసం చేయడంతో పాటు మల్లారెడ్డి ఫోటోను దగ్ధం చేశారని ఫైర్ అయ్యారు.
2 వేల మంది చదువుతున్న ఈ కాలేజీలో 22 మందిని డీటెయిండ్ చేస్తే ఆయన వచ్చి దౌర్జన్యం ఏమిటని ప్రశ్నించారు.విద్యార్థులకు ఆరుసార్లు అవకాశం ఇచ్చామని, అయినప్పటికీ వారు ఫెయిల్ అవ్వడంతో డిటెయిండ్ నోటీసులు ఇచ్చామన్నారు. అందులో తప్పు ఏముందని, ఎందుకు మైనంపల్లి మా ఇనిస్టిట్యూట్ మీద దాడులు చేయించారని ప్రశ్నించారు. సీఎంఆర్ హాస్పిటల్స్‌లో 25వేల ఫ్రీ డెలివరీలు చేశామని, కేసీఆర్ కిట్ వలే సీఎంఆర్ కిట్ పేరిట 5వేల కిట్ ఫ్రీగా గర్భిణులకు అందజేస్తున్నామన్నారు. తమపై దాడులు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులు, ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కాగా, బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక మైనంపల్లి కాంగ్రెస్ పార్టీలో చేరగా.. మల్లారెడ్డి ఇప్పుడిప్పుడే అధికారపార్టీలో చేరేందుకు పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే వీరిద్దరి వర్గ పోరు నడుస్తోందని మేడ్చల్ రాజకీయాల్లో చర్చ నడుస్తోంది.