పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఛత్తీస్గఢ్(Chhattisgarh)లో మంగళవారం మరోసారి మావోయిస్టులు(Maoists), భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. పోలీసులు భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.
నారాయణపూర్ జిల్లాలోని అబుజ్ మడ్ అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పులు(Encounter) చోటుచేసుకోగా.. మావోయిస్టుల కోసం భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. అయితే, మావోయిస్టుల సంచారం గురించి ముందుగానే విశ్వసనీయ సమాచారం అందుకున్న పోలీసులు వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
సరిగ్గా అదే సమయంలో మావోయిస్టులు పోలీసుల మీదకు కాల్పులు జరపడంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు బలగాలు ఎదురుకాల్పులు జరిపాయి. అనంతరం కాల్పులు జరిపిన ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టగా నలుగురు మావోయిస్టుల మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇదిలాఉండగా, సార్వత్రిక ఎన్నికలు ప్రారంభానికి ముందు నుంచే మావోయిస్టుల ఏరివేతను ఆ రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తోంది.
నక్సలిజం అంతమే లక్ష్యంగా ఛత్తీస్ గఢ్ బీజేపీ సర్కార్, కేంద్రంలోని మోడీ సర్కార్ పనిచేస్తుందని, మరోసారి కేంద్రంలో బీజేపీ పవర్లోకి వస్తే రానున్న రోజుల్లో నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని కేంద్రహోంమంత్రి అమిత్ షా ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.కాగా, ఈ మధ్య కాలంలో జరిగిన వరుస ఎన్ కౌంటర్లలో సుమారు 50 మందికి పైగా మావోయిస్టులు హతమైనట్లు తెలుస్తోంది.