బిహార్ సీఎం నితీశ్ కుమార్ (Nitish Kumar) కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ (NDA )కూటమిలో శాశ్వత భాగస్వామిగా ఉండేందుకు ప్లాన్ చేస్తున్నానని తెలిపారు. గతంలో రెండు సార్లు ఎన్డీఏ కూటమిని వదిలి పెట్టానని చెప్పారు. కానీ ఇకపై అలా జరగబోదని స్పష్టం చేశారు.
మీడియాతో సీఎం నితీశ్ కుమార్ మాట్లాడుతూ….. గతంలో బీజేపీ-జేడీయూ కలిసి ఉన్నాయని చెప్పారు. మధ్యలో రెండు సార్లు తాను అటు ఇటు కూటములు మారిన మాట వాస్తవమేనని అన్నారు. ఇప్పుడు మరోసారి ఎన్డీఏలోకి వచ్చానని… ఇకపై శాశ్వతంగా ఎన్డీఏ కూటమిలోనే కొనసాగుతానని తేల్చి చెప్పారు.
ఇది ఇలా వుంటే మహాఘట బంధన్ తో తెగ తెంపులు చేసుకున్న తర్వాత తాజాగా ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలతో నితీశ్ కుమార్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో నితీశ్ కుమార్ భేటీ అయ్యారు. ఈ సమావేశాలపై మీడియా అడిగిన ప్రశ్నకు బదులిస్తూ…..
బిహార్ అభివృద్ధి, పురోగతిపై ప్రధాని మోడీ, అమిత్ షాలతో చర్చించామని తెలిపారు. బిహార్లో ఎన్డీయే కూటమి మద్దతుతో కొత్త ప్రభుత్వం ఏర్పాటైందన్నారు. ప్రజలకు సేవ చేయడమే తమ ప్రాథమిక లక్ష్యమని వెల్లడించారు. కేంద్రం, రాష్ట్రంలోని ఎన్డీయే సంకీర్ణ ప్రభుత్వంతో రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. మోడీ నాయకత్వంలో రాష్ట్రంలోని ఎన్డీయే ప్రభుత్వం అభివృద్ధిలో ఎంతో ఎత్తుకు ఎదుగుతుందన్నారు.