కాంగ్రెస్ (Congress)పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (Kavitha) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇందిరమ్మ రాజ్యంగా అని చెప్పుకుంటూ ఏర్పడిన కొత్త ప్రభుత్వంలో ఆడబిడ్డలకు తీరని అన్యాయం జరుగుతోందని ఫైర్ అయ్యారు. రిజర్వేషన్ల స్ఫూర్తిని పక్కనబెడుతూ మహిళలకు కొత్త రిజర్వేషన్లు అంటూ కాంగ్రెస్ కొత్త జీవో తీసుకురావడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు.
ఆడ బిడ్డల హక్కులను కాంగ్రెస్ తుంగలో తొక్కుతోందని విమర్శలు గుప్పించారు.ప్రభుత్వ తీసుకున్న నిర్ణయాల వల్ల ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు తీరని అన్యాయం జరుగుతోందని అన్నారు. ఈ అంశంపై జాతీయ పార్టీ కాంగ్రెస్ తన వైఖరి ఏంటో చెప్పాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు.
ఈ మేరకు యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఆమె లేఖ రాశారు. 1996లో అనేక పోరాటాల ఫలితంగా ఉపాధి అవకాశాల్లో మహిళలకు 33.3 శాతం రిజర్వేషన్లు కల్పించారని అన్నారు. ఈ మేరకు జీవో నంబర్ 41,56 జారీ చేశారని గుర్తు చేశారు. ఆ తర్వాత 1992లో సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన ఇందిరా సాహ్ని తీర్పు కూడా దానికి ఎంతో సహాయం చేసిందని పేర్కొన్నారు.
ఆ తర్వాత రాజ్యంగబద్ధంగా మహిళలకు రోస్టర్ పాయింట్లతో కూడిన హారిజాంటల్ రిజర్వేషన్లు కల్పించారని వివరించారు. దేశంలో సామాజిక రిజర్వేషన్లు ఎలా ఉన్నాయో అలాగే మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కచ్చితంగా అమలు చేసే పద్ధతి నడుస్తోందని వెల్లడించారు.