భారత్ (India) శరవేగంగా అభివృద్ధి చెందుతోందని ప్రధాని మోడీ (PM Modi) అన్నారు. తమ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలతో గత పదేండ్లలో దేశంలో సుమారు 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని వెల్లడించారు. కేంద్రంలో మూడవ సారి ఎన్డీఏ అధికారంలోకి వస్తే భారత్ ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదుగుతుందని మోడీ అన్నారు.
ఢిల్లీలో జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పోలో పాల్గొని ప్రధాని మోడీ మాట్లాడుతూ…. ట్రక్కు, ట్యాక్సీ డ్రైవర్ల కోసం జాతీయ రహదారుల వెంబడి ఫేజ్-1లో 1,000 ఆధునిక విశ్రాంతి గృహాలను నిర్మిస్తామని ప్రధాని ప్రకటించారు. 2014కి ముందు పదేళ్లలో దేశంలో దాదాపు 12 కోట్ల వాహనాలను విక్రయించారని తెలిపారు. 2014 నుండి దేశంలో 21 కోట్లకు పైగా వాహనాలు అమ్ముడయ్యాయని వివరించారు.
పదేండ్ల క్రితం సుమారు 2,000 ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించగా, ఇప్పుడు 12 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడయ్యాయని చెప్పారు. గత 10 ఏళ్లలో ప్యాసింజర్ వాహనాల్లో దాదాపు 60 శాతం వృద్ధి నమోదైందన్నారు. అటల్ టన్నెల్ నుండి అటల్ సేతు వరకు భారత మౌలిక సదుపాయాల అభివృద్ధి సరి కొత్త రికార్డులను సృష్టిస్తోందని వివరించారు.
గత 10 ఏళ్లలో 75 కొత్త విమానాశ్రయాలను నిర్మించామని… దాదాపు 4 లక్షల గ్రామీణ రహదారులను నిర్మించామని పేర్కొన్నారు. 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని స్పష్టం చేశారు. మొబిలిటీ రంగానికి ఇది స్వర్ణయుగమన్నారు. స్వయం ఆకాంక్షలు, ఆశలతో దేశంలో నూతన మధ్యతరగతి ఎదిగివస్తోందన్నారు.