మహిళలు ఆత్మగౌరవంతో బతకాలనేదే తమ ప్రభుత్వ ఉద్దేశమని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) వెల్లడించారు. గతంలో రాష్ట్రంలోని మహిళలకు కాంగ్రెస్ సీఎంలు తక్కువ వడ్డీకే రుణాలు ఇచ్చారని అన్నానరు. తమ ప్రభుత్వం కూడా ఇప్పుడు రాష్ట్ర మహిళల గౌరవాన్ని నిలబెట్టేలాగా పని చేస్తోందని వెల్లడించారు.
సీఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్‌లో పర్యటిస్తున్నారు. కేస్లాపూర్ నాగోబా ఆలయాన్ని దర్శించుకున్నారు. కేస్లాపూర్‌లో నాగోబా దర్భార్‌లో భాగంగా అక్కడి స్వయం సహాయక సంఘాలతో సీఎం రేవంత్ రెడ్డి ముఖాముఖిగా మాట్లాడారు. ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
విద్యుత్ బిల్లులు ఎక్కువ వస్తున్నాయని చెప్పారు. రాష్ట్రంలో త్వరలోనే 200 యూనిట్లకు ఉచిత కరెంట్ పథకాన్ని అమలు చేస్తామని చెప్పారు. ప్రస్తుతం గ్యాస్ ధర రూ. 1500 ఉందని, త్వరలోనే గ్యాస్‌ను రూ. 500లకే అందజేస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలకు యూనిఫామ్‌లు కుట్టే ప్రభుత్వ కాంట్రాక్ట్‌లను ఎస్‌హెచ్‌జీలకే కేటాయిస్తామని హామీ ఇచ్చారు.
ఆర్బీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తుంటే బీఆర్ఎస్ నేతలకు ఎందుకు కడుపు నొప్పి అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో 1650 డ్వాక్రా సంఘాలకు సుమారు రూ. 60 కోట్లకు పైగా రుణాలను పంపిణీ చేశారు.