ఈ నెల నుంచి తెలంగాణలో ఎవరూ కరెంట్ బిల్లులు చెల్లించవద్దని, బిల్లులన్నింటినీ సోనియా గాంధీ (Sonia Gandhi)కే పంపుదామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ (KTR) అన్నారు. సోనియాకు బిల్లులు పంపేలా ప్రజలను బీఆర్ఎస్ శ్రేణులు సమాయత్తం చేయాలని పిలుపునిచ్చారు. గతంలో జరిగిన పొరపాట్లు ఇక ముందు జరగబోవని వెల్లడించారు.
తెలంగాణ భవన్లో కార్యకర్తలను ఉద్దేశించి కేటీఆర్ మాట్లాడుతూ… 200 యూనిట్ల లోపు విద్యుత్ బిల్లులను జనవరి నుంచి కట్టొద్దని సీఎం రేవంత్ రెడ్డి గత నెలలో చెప్పారని కేటీఆర్ గుర్తు చేశారు. అంతకు ముందు ఆ బిల్లులను నవంబర్ నుంచే కట్టొద్దని కోమటిరెడ్డి వెంకట రెడ్డి కూడా పిలుపునిచ్చారని చెప్పారు. తాను ఇప్పుడు వారి మాటలనే గుర్తుచేస్తున్నానని అన్నారు.
‘ నేను ఆ వ్యాఖ్యలను గుర్తు చేస్తూ బిల్లులు కట్టవద్దంటే నాది విధ్వంసకర మనస్తత్వం అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. నిజాలు మాట్లాడితే విధ్వంసకర మనస్తత్వమా ? అని ప్రశ్నించారు. సోనియానే బిల్లులు కడుతుందని వాళ్ళు చెప్పారు. అందుకే కరెంటు బిల్లులు సోనియాకే పంపుదా.సోనియాకు ప్రజలు బిల్లులు పంపేలా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు ప్రజలను సమాయాత్తం చేయాలి’అని పిలుపునిచ్చారు.
ప్రగతి భవన్ లో విలాస వంతమైన సౌకర్యాలు ఉన్నాయంటూ దుష్ప్రచారం చేశారని పేర్కొన్నారు. ఇప్పుడు భట్టి అందులోనే ఉంటున్నారు కదా అని చెప్పారు. విలాసాలే అందులో ఉంటే భట్టి ఈ పాటికే టాం టాం చేయక పోయేవారా? అని ప్రశ్నించారు.ఆన్లైన్ లో రేషన్ కార్డులను ఇచ్చామన్నారు ..ఆ విషయం కార్యకర్తలకు కూడా తెలియలేదన్నారు. పార్టీ కమిటీలను కూడా పూర్తిగా వేయలేదన్నారు. అందువల్లే నష్టం జరిగిందన్నారు.
ఇక ముందు ఆలాంటి తప్పులు జరగబోవని హామీ ఇచ్చారు. మూడు నెలలకోసారి అన్ని కమిటీల సమావేశాన్ని నిర్వహించుకుందామని చెప్పారు.కారు ఇప్పుడు కేవలం సర్వీసింగ్ కు వెళ్ళిందని పేర్కొన్నారు. మళ్ళీ రెట్టింపు వేగంతో పరుగెత్తుతుందని తేల్చి చెప్పారు. బీఆర్ఎస్, బీజేపీ టీం కాదు ..బీజేపీ ,కాంగ్రెస్ లు ఒక్కటేనని స్పష్టంగా తెలియడం లేదా? అని ప్రశ్నించారు.