రానున్న ఎన్నికల నేపథ్యంలో తెలంగాణాలో వలస రాజకీయాలు ఊపందుకున్నాయి.టికెట్ దక్కక పోవడంతో అసంతృప్త నేతలు వరుసగా బీఆర్ఎస్(BRS) ను వీడుతున్నారు.తాజాగా ఓ మాజీ ఎమ్మెల్యే గులాబీ గూటినుంచి కాంగ్రెస్ గూటికి చేరాడు.
హ్యాట్రిక్ విజయం సాధించి మరోసారి అధికారంలోకి రావాలని చూస్తోన్న అధికార బీఆర్ఎస్ పార్టీకి ఇది రీసెంట్ షాక్. తెలంగాణా ఉద్యమకారుడు.. చెన్నూరు(Chennoor)మాజీ ఎమ్మెల్యే ‘నల్లాల ఓదేలు(Nalla Odelu)’కు టిక్కెట్ దక్కకపోవడంతో గులాబీ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో బీఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చాడు.
గత కొన్ని రోజులుగా పార్టీ మారుతున్నాడంటూ వస్తోన్న వార్తలను నిజం చేస్తూ…ఇవాళ నల్లాల ఓదేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు.శుక్రవారం హైదరాబాద్లో టీపీసీసీ చీఫ్(TPCC Chief)రేవంత్ రెడ్డి (Revanth Reddy)సమక్షంలో ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
నల్లాల ఓదేలుకు కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.ఓదేలుతో పాటు ఆయన భార్య, మంచిర్యాల జెడ్పీ చైర్ పర్సన్(ZP Chairperson)భాగ్యలక్ష్మి కూడా రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
వీరితో పాటు కౌన్సిలర్ శివ కిరణ్, నల్లాల శ్రావణ్, నల్లాల సందీప్, దుర్గం నరేష్, ముజాహిద్, మెరుగు ప్రభాకర్, మహేందర్, తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే అంతర్గత కుమ్ములాటలకు కేరాఫ్ అడ్రస్ అయిన కాంగ్రెస్ ను ఓదేలు ఈదగలరా అన్నదే అసలు ప్రశ్న.