వారణాసి (Varanasi) లోని జ్ఞానవాపి మసీదులో పురావస్తు శాఖ సర్వే కొనసాగుతోంది. ఈ సర్వేలో ఓ త్రిశూలం (Trident), స్వస్తిక (Swastika), బెల్ (Bell), పుష్పం (Flower) వంటి చిహ్నాలను గోడలపైన, స్తంభాలపైనా గుర్తించారు. వీటిని వీడియోల్లో చిత్రీకరించారు. లోగడ ఇక్కడున్న హిందూ ఆలయాన్ని కూల్చివేసి దానిపై మసీదును నిర్మించారన్న విషయాన్ని నిర్ధారించేందుకు కోర్టు ఆదేశాల మేరకు భారత పురావస్తు శాఖ సిబ్బంది సర్వేను కొనసాగిస్తున్నారు. వీడియోగ్రఫీ, ఫొటోగ్రఫీ కూడా ఏకకాలంలో కొనసాగుతున్నాయి.
వివాదాస్పదమైన ఈ కట్టడం లోని డోమ్స్ , పిల్లర్స్ పై గల ప్రతి డిజైన్ ని తాము వీడియో తీస్తున్నట్టు అధికారి ఒకరు తెలిపారు. జ్ఞానవాపి మసీదు సముదాయం వద్ద ముందు జాగ్రత్త చర్యగా భారీ సంఖ్యలో పోలీసులను, భద్రతా బలగాలను మోహరించారు. మొదటి రోజైన శుక్రవారం 7 గంటలపాటు సర్వే కొనసాగింది.
ఈ మసీదుకు సంబంధించిన నాలుగు మూలల్లోను డయల్ టెస్ట్ ఇండికేటర్లను ఏర్పాటు చేయడమే గాక ఈ కాంప్లెక్స్ లోని వివిధ భాగాల లోతు, ఎత్తును కూడా కొలతలు తీసుకుంటున్నామని ఆ అధికారి పేర్కొన్నారు. 37 మంది సిబ్బంది ఈ సర్వేలో పాల్గొంటున్నారు. సర్వే శనివారం ఉదయం 7 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం పన్నెండున్నర వరకు సాగింది.
మళ్ళీ మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి ప్రారంభమై సాయంత్రం 5 గంటలవరకు జరిగింది. ఈ మసీదు లో హిందూ దేవతా విగ్రహాలు ఉన్నాయని వాటిని పూజించే హక్కు ఉందని అంటూ హిందూ మహిళలు కొందరు వారణాసి లోని కోర్టుకెక్కారు. అయితే మసీదు కమిటీ దీన్ని సవాలు చేస్తూ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించింది. .