రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలు తీరని విషాదాన్ని మిగిల్చాయి. ఇళ్ళు , పంటలు, తమఆత్మీయులను కోల్పోయిన బాధితుల ఆవేదన చెప్పనలవి కాదు. సర్వస్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలామని వారు కన్నీరు మున్నీరవుతున్నారు. నీట మునిగిన తమ పంటపొలాలను చూసి గుండెలవిసేలా రోదిస్తున్నారు. మా బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియడంలేదని అల్లాడుతున్నారు. తాజాగా తెలంగాణ గవర్నర్ తమిళిసై ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ముంపు ప్రాంతాలను సందర్శించారు.
హనుమకొండలోని జవహర్ నగర్, నయీమ్ నగర్ తదితర ప్రాంతాలను విజిట్ చేసి బాధితులను పరామర్శించారు. వారికి రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో హెల్త్ అండ్ హైజీన్ కిట్లను, నిత్యావసర వస్తువులను అందజేశారు. వరంగల్ భద్రకాళి ఆలయాన్ని కూడా ఆమె సందర్శించి తన మొక్కులు చెల్లించుకున్నారు. భారీ వర్షాలు, వరదలకు ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారని, వారిని చూస్తుంటే గుండె తరుక్కుపోయిందని తమిళిసై ఆ తరువాత పేర్కొన్నారు.
రెండు రోజుల క్రితం వరదలు బీభత్సంగా ఉన్నప్పుడు తాను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో మాట్లాడానని, యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేబట్టాలని వారికి సూచించానని ఆమె తెలిపారు. బాధితులను ఆదుకునేందుకు నిరంతరం సేవలు చేబట్టిన వారికి ఆమె ధన్యవాదాలు తెలిపారు.
ఎంజీవోలు, ఇతర స్వచ్చంద సంస్థలు కూడా సహాయక చర్యల్లో పాలుపంచుకున్నాయన్నారు. ప్రభుత్వం స్పందించి బాధితులకు మరింత సాయం అందజేయాలని ఆమె కోరారు. ప్రకృతి వైపరీత్యాల విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా చూడాలని ఆమె సూచించారు.