URI : హింసతో అట్టుడికిన మణిపూర్ లో మళ్లీ ప్రశాంత పరిస్థితులు నెలకొంటున్నాయా ? శాంతి భద్రతలను పూర్తిగా పునరుద్ధరించారా ? జనం తిరిగి సాధారణ జీవన స్రవంతిలో అడుగుపెట్టారా ? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఒకటే. అదే.. ఓ ఓపెన్ థియేటర్ లో ప్రదర్శించిన హిందీ చిత్రం.. ‘యూరి.. ది సర్జికల్ స్ట్రైక్ ‘ మూవీని చూసేందుకు జనం పోటెత్తడమే. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నిన్న చురా చాంద్ పూర్ జిల్లాలోని ఓ థియేటర్ లో ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. విక్కీ కౌశల్ నటించిన ఈ సినిమాను 23 ఏళ్ళ తరువాత మొట్టమొదటిసారిగా తాత్కాలిక ఓపెన్ థియేటర్ లో ప్రదర్శిస్తే.. ఈ ప్రాంగణమంతా జనంతో కిక్కిరిసిపోయింది.
2000 సంవత్సరం సెప్టెంబరులో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన రాజకీయ సంస్థ.. ది రెవల్యూషనరీ పీపుల్స్ ఫ్రంట్ .. రాష్ట్రంలో హిందీ సినిమాలను నిషేధించింది. అయితే ఈ బ్యాన్ ను వ్యతిరేకిస్తూ హమర్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఈ సినిమా ప్రదర్శనను నిర్వహించింది. రెండు దశాబ్దాల తరువాత మా టౌన్ లో ఓ హిందీ సినిమాను ప్రదర్శించడం ఇదే మొదటిసారి అని, చాలాకాలం క్రితమే మెయితీలు రాష్ట్రంలో బాలీవుడ్ మూవీల ప్రదర్శనను బ్యాన్ చేశారని ఇండైజినస్ ట్రైబల్ లీడర్స్ ఫోరం అధికార ప్రతినిధి గింజా వోల్జాంగ్ ఓ స్టేట్మెంట్ లో పేర్కొన్నారు.
మెయితీ వర్గాల దేశ వ్యతిరేక విధానాలను ఉల్లంఘించి, ఇండియా పట్ల మాకు గల ప్రేమాభిమానాలను చూపడానికే ఈ చర్య తీసుకున్నామని ఆయన అన్నారు. ఇందుకు హమర్ స్టూడెంట్స్ అసోసియేషన్ కూడా సహకరించిందన్నారు. తమను కుల్కీ తెగలవాణిగా ఈ సంస్థ చెప్పుకుంది. ఈ చిత్ర ప్రదర్శనకు ముందు జాతీయ గీతాన్ని కూడా ఆలపించారు. ఇంఫాల్ కు సుమారు 63 కి.మీ. దూరంలో ఉందీ ప్రాంతం.
మణిపూర్ లో చివరిసారి 1998 లో ‘కుచ్ కుచ్ హోతా హై’ చిత్రాన్ని ప్రదర్శించారు. 2000 సంవత్సరంలో హిందీ సినిమాలపై బ్యాన్ విధించిన తరువాత మెయితీ మిలిటెంట్లు బాలీవుడ్ చిత్రాలకు సంబంధించి ఆరు వేలనుంచి ఎనిమిది వేల వీడియో, ఆడియో కేసెట్లను, కాంపాక్ట్ డిస్కులను కాల్చివేశారు.