Telugu News » Rishi Sunak : రామకథా ప్రవచనం.. బ్రిటన్ ప్రధాని పరవశం !

Rishi Sunak : రామకథా ప్రవచనం.. బ్రిటన్ ప్రధాని పరవశం !

by umakanth rao
Rishi sunak

 

 

Rishi Sunak : నేను హిందువును.. ఆ తరువాతే బ్రిటన్ ప్రధానిని అని ఆ దేశ పీఎం రిషి సునాక్ మరోసారి చెప్పుకున్నారు. భారత 77 వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన మంగళవారం కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన రామకథా ప్రవచన కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు మురారీ బాపు నిర్వహించిన ఈ కార్యక్రమంలో రామకథా ప్రవచనం ఆయనను పరవశుడ్నిచేసింది. ఇక్కడికి తాను రావడం ఎంతో ఆనందంగా ఉందని, ఓ ప్రధానిగా కాకుండా ఓ హిందువుగా ఈ కార్యక్రమానికి హాజరయ్యానని ఆ తరువాత ఆయన తెలిపారు. రిషికి బాపు మురారీ సాదరంగా స్వాగతం పలికారు.కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలోని జీసస్ కాలేజీలో ఈ కార్యక్రమం జరిగింది.

 

British PM Rishi Sunak attends Ram Katha recital by Morari Bapu at Cambridge University

 

ఇక్కడికి రావడం, తన విశ్వాసం తన పర్సనల్ అని, హిందుత్వ విశ్వాసం తన జీవితాన్ని ఎంతో ప్రభావితం చేస్తుందని సునాక్ చెప్పారు. ప్రధానిగా ఉండడం ఎంతో గౌరవ సూచకమని, కానీ ఇది సులువైన పదవి కాదని చెప్పిన ఆయన.. ఎన్నో క్లిష్ట నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుందన్నారు. పలు సవాళ్ళను ఎదుర్కోవలసి ఉంటుందని, కానీ ఈ విశ్వాసమే తనకు శక్తినిస్తుందన్నారు. కాగా ఓ సాధారణ వ్యక్తిగా ఇక్కడికి వచ్చిన మీకు ఘన స్వాగతం అని మురారీ బాపు ..సునాక్ ని ఉద్దేశించి అన్నారు.

ఇక మత విశ్వాసాలు నా జీవితంలోని ప్రతి అంశాన్ని ప్రభావితం చేస్తాయి.. ప్రధానిగా వీలైనంత మెరుగ్గా నా బాధ్యతలను నిర్వహించేందుకు ప్రోత్సహిస్తాయి అని సునాక్ పేర్కొన్నారు. ప్రవచన వేదికపై ఏర్పాటు చేసిన హనుమంతుడి బంగారు ప్రతిమ గురించి ప్రస్తావించిన ఆయన.. తన అధికారిక కార్యాలయంలోని టేబుల్ పై కూడా గణేశుడి ప్రతిమ ఉందని చెప్పారు. ఈ ప్రతిమ ఎప్పుడూ తన విధులను గుర్తు చేస్తూ ఉంటుందన్నారు.

తన బాల్యం గురించి పేర్కొన్న ఆయన., ఆ వయస్సులో తాను తరచు సౌతాంప్టన్ లోని గుడికి వెళ్లి వస్తుండేవాడినని గుర్తు చేసుకున్నారు. తన కుటుంబం పూజలు, హోమాలు చేస్తుండేదని, భక్తులకు తీర్థ ప్రసాదాలు ఇచ్చేవారమన్నారు. రాముడు నాకు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకంగా ఉంటాడు., బాపు చెప్పిన రామాయణ ప్రవచనంతో బాటు భగవద్గీత, హనుమాన్ చాలీసాను కూడా పఠిస్తుంటాను అని ఆయన చెప్పారు. సోమనాథ్ ఆలయంలో ప్రతిష్టించిన శివలింగాన్ని మురారీ బాపు రిషి సునాక్ కు బహుకరించారు.  2020 లో తొలి బ్రిటిష్ పీఎం అయిన రిషి సునాక్.. తన అధికారిక నివాసం వద్ద జరుపుకున్న మొదటి దీపావళి పండుగ వేడుకలను కూడా గుర్తు చేసుకున్నారు.

You may also like

Leave a Comment