Manipur : ప్రధాని మోడీ (Modi)ప్రభుత్వంపై ప్రతిపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానంపై పార్లమెంటులో చర్చ సందర్భంగా తనను మాట్లాడవద్దన్నారని మణిపూర్ ఎంపీ ఒకరు తెలిపారు. లోక్ సభలో మణిపూర్ నుంచి ఆయన ఒక్కరే బీజేపీ మిత్రపక్షమైన నాగా పీపుల్స్ ఫ్రంట్ (Naga Peoples Front) పార్టీకి చెందినవారు. చర్చ జరుగుతుండగా తాను కూడా మాట్లాడదామనుకున్నానని, కానీ కూటమిలోని సభ్యులు, ముఖ్యంగా బీజేపీకి చెందిన నేతలు తనను వారించారని లోర్హో ఎస్. ఫోజ్ (Lorho S.Pfoze) వెల్లడించారు.
మణిపూర్ లో సాధారణ పరిస్థితులు నెలకొనేలా చూసేందుకు, శాంతిని పునరుద్ధరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని చెప్పాలనుకున్నా.. కానీ నోరెత్తవద్దని వారు సలహా ఇచ్చారు ..నన్ను అనుమతించలేదు అని లోర్హో పేర్కొన్నారు. నిజానికి ఈయన నియోజకవర్గంలోని ప్రాంతాల్లోనే ఎక్కువగా హింసాత్మక ఘటనలు జరిగాయి.
‘నా చేతులు కట్టేశారు .. నేను బీజేపీ మిత్ర పక్షానికి చెందినవాడిని.. అందుకే వారి ఆదేశాలను పాటించక తప్పలేదు అని ఆయన చెప్పారు. ప్రధాని మోడీ తమ రాష్ట్రాన్ని సందర్శించాల్సి ఉండిందని, హింసాకాండ బాధితులను పరామర్శించి ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఈ పని చేశారని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. మణిపూర్ నే కాదని, దేశ వ్యాప్తంగా అనేక చోట్ల జరుగుతున్న హింసాత్మక ఘటనలను కూడా అణచివేయవలసి ఉందన్నారు.