అయోధ్య రామాలయం(Ayodhya Ramalayam) ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్(Hyderabad) ఓ క్యాటరింగ్ యజమాని భారీ లడ్డును తయారు చేస్తున్నారు.
ఈ భారీ లడ్డును హైదరాబాద్ నుంచి అయోధ్యకు పార్సిల్ చేయనున్నారు. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ కంటోన్మెంట్ పికెట్ ప్రాంతానికి చెందిన శ్రీరామ క్యాటరింగ్ సర్వీసెస్ యజమాని నాగభూషణంరెడ్డి, కృష్ణకుమారి దంపతులు ప్రత్యేకంగా 1,265 కేజీల భారీ లడ్డును తయారు చేయించారు.
అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం నేపథ్యంలో ఆలయ నిర్మాణానికి భూమిపూజ జరిగినప్పటి నుంచి రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠాపనకు 1,265 రోజులు పట్టింది. దీనికి గుర్తుగా నాగభూషణం దంపతులు అదే సంఖ్య బరువు గల లడ్డు తయారు చేయించడం విశేషం.
ఈ విషయమై శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ప్రతినిధి చంపత్రాయ్‌ను అనుమతి పొందినట్లు తెలిపారు. ఆయన సూచనలతో 1265కిలోల బరువున్న లడ్డూను తయారు చేసినట్లు తెలిపారు. బుధవారం ఉదయం 6 గంటలకు పికెట్‌లోని తమ నివాసం నుంచి లడ్డు శోభాయాత్రను ప్రారంభిస్తామని నాగభూషణంరెడ్డి తెలిపారు.
అదేవిధంగా విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ కార్యకర్తలు హైదరాబాద్ నుంచి ప్రసాద సామగ్రిని పంపారు. విశ్వహిందూ పరిషత్ ప్రతినిధి రామారావు మాట్లాడుతూ.. అయోధ్యలోని గోలాఘాట్ రోడ్డులో ఉన్న శ్రీరామస్వామి ఆలయంలో అన్నదాన కార్యక్రమం జరగనుందని తెలిపారు. ఆహార తయారీకి అవసరమైన 40టన్నుల వివిధ సామగ్రిని ఇప్పటికే సేకరించి పంపించామని చెప్పారు.
దాతల సాయంతో 45 రోజుల పాటు నిత్యం 5వేల మందికి అన్నదానం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. దీని కోసం కమిటీని నియమించామన్నారు. తమ కార్యకర్తలు 150మంది అయోధ్య వెళ్తున్నారని చెప్పారు. అదేవిధంగా 35మంది వంటవాళ్లు వండి వడ్డిస్తారని తెలిపారు.