అయోధ్య (Ayodhya) లో రామ మందిర ప్రారంభోత్సవానికి మరి కొన్ని గంటలే మిగిలి ఉన్నాయి. ‘రామ్ లల్లా’ (Ram Lalla) ప్రాణ ప్రతిష్ట సందర్బంగా ఆలయాన్ని అందంగా అలంకరించారు. ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి సంబంధించిన క్రతువులు సోమవారం ఉదయానికి పూర్తి కానున్నాయి. ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి రేపు దేశ విదేశాల ప్రముఖులు ఆలయం వద్దకు చేరుకుంటారు.
ప్రధాని నరేంద్ర మోడీ, యూపీ సీఎం యోగీ ఆదిత్య నాథ్ తో పాటు సాధు సంతువులు, ప్రముఖులతో కలిపి మొత్తం ఏడు వేల మంది అతిథులను శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఆహ్వానించింది. 7వేల మందిలో జాబితా ఏలో 506 మంది అత్యంత ప్రముఖులను చేర్చారు.ఇక వివిధ ప్రాంతాలక చెందిన 14 జంటలు ప్రాణప్రతిష్ఠకు అతిథేయులుగా వ్యవహరించనున్నాయి.
సోమవారం ఉదయం మధ్యాహ్నం శుభ ముహూర్తం 12 గంటల 20 నిమిషాలకు ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ప్రారంభం అవుతుంది. ఒంటి గంట వరకు కార్యక్రమం కొనసాగనుంది. సంప్రదాయాన్ని అనుసరించి అత్యంత వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.కార్యక్రమం నేపథ్యంలో రామాలయాన్ని రంగు రంగుల పుష్పాలతో, మిరుమిట్లుగొలిపే విద్యుద్దీపాలతో అలంకరించారు.
ఇప్పటికే రామ్ లల్లా విగ్రహాన్ని రామ మందిరంలో ప్రతిష్టించారు. మైసూరుకు చెందిన అరుణ్ యోగిరాజు దీన్ని రూపొందించారు. పలు వివాదాల కారణంగా రామ్ లల్లా విరాజ్ మాన్ విగ్రహం చాలా ఏండ్లుగా తాత్కాలిక మందిరంలోనే ఉండి పోయింది. తాజాగా ఈ విగ్రహాన్ని భవ్యమందిరంలో నూతన విగ్రహం ముందు ప్రతిష్ఠించనున్నారు. ఈ విగ్రహం ఐదు నుంచి ఆరు అంగుళాలు మాత్రమే ఉంటుందని ట్రస్టు పేర్కొంది. 25 నుంచి 30 అడుగుల దూరం నుంచి రామ్ లల్లా విరాజ్ మాన్ విగ్రహాన్ని వీక్షించడం భక్తులకు సులభంకాదని తెలిపింది.
ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని మంగళధ్వని మధ్య వైభవంగా నిర్వహిస్తామని ట్రస్ట్ పేర్కొంది. అత్యంత ప్రముఖులైన సంగీత విద్వాంసులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పింది. పలు రాష్ట్రాల్లో ప్రఖ్యాతి గాంచిన 50 సంగీత వాయిద్యాలకు ఒకే వేదికపై చోటు కల్పించినట్టు పేర్కొంది. మొత్తం రెండు గంటల పాటు మంగళధ్వని కార్యక్రమం ఉంటుందని ఎక్స్ లో పోస్ట్ చేసింది.
శ్రీ రాముడి భవ‌్య మందిరాన్ని జీ+2 పద్దతిలో నిర్మించారు. ఆలయంలో తూర్పున 32 మెట్లు ఎక్కిన ప్రధాన ఆలయంలోకి భక్తులు చేరుకునేలా ఏర్పాటు చేశారు. ఆలయ సముదాయాన్ని ఆధునికంగా తూర్పు నుంచి పశ్చిమానికి 380 అడుగులతో సంప్రదాయ నగర విధానంలో 250 అడుగుల వెడల్పు, 161 అడుగుల ఎత్తున భవ్య మందిరం ఆకట్టుకునేలా ఆలయాన్ని తీర్చిదిద్దారు.
ప్రతి అంతస్తులో 20 అడుగుల ఎత్తులో మొత్తం 392 స్తంభాలను 392 స్తంభాలు, 44 గేట్లతో నిర్మించారు. ఇప్పటి వరకు రామమందిర నిర్మాణానికి 1100 కోట్ల రూపాయలు ఖర్చు అయినట్లు ట్రస్టు వెల్లడించింది. మరోవైపు ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. యూపీకి చెందిన పోలీసు విభాగాలు,ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్,ఇంటెలిజెన్స్ బ్యూరో, ఎస్పీఎఫ్ తో పాటు కేంద్ర బలగాలు పహార కాస్తున్నారు.
అయోధ్యలో 10వేల సీసీటీవీలను ఏర్పాటు చేశారు.యాంటీ డ్రోన్ సిస్టమ్, కమాండ్ కంట్రోల్ ను ఏర్పాటు చేశారు. ఎలాంటి ప్రమాదకర పరిస్థితి తలెత్తినా ఎదుర్కొనేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అయోధ్యలో మోహరించారు.ఈ బృందాలు రసాయన, అణు దాడులు, భూకంపాల వంటి విపత్తులను ఎదుర్కొనే విధంగా శిక్షణ పొందారని అధికారులు తెలిపారు.
అయోధ్యకు వచ్చే అన్ని మార్గాల్లో ప్రత్యేక చెక్ పోస్ట్‌లు ఏర్పాటు చేశారు. అయోధ్యకు వస్తున్న ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశాకే అనుమతిస్తున్నారు. అతిథులకు ఇచ్చిన ప్రవేశ పాసులో ప్రత్యేక క్యూఆర్ కోడ్ ఉన్న ఎంట్రీ పాసులను జారీ చేశారు. క్యూ ఆర్ కోడ్ వివరాలు సరిపోలితేనే భక్తులను ఆలయంలోకి అనుమతించనున్నారు.