అయోధ్య (Ayodhya) త్వరలో పర్యాటక కేంద్రంగా మారబోతోందనే వార్తలు జోరుగా హాల్ చల్ చేస్తున్నాయి.. ఇక్కడ ఎంతో ప్రాముఖ్యత కలిగిన రామ మందిర (Ram Mandir) నిర్మాణం 500 సంవత్సరాల చరిత్రను పునరావృతం చేసిన నేపథ్యంలో ప్రముఖ క్షేత్రంగా మారబోతుందని తెలుస్తోంది. భక్తుల తాకిడితో పాటుగా పర్యాటకులు సైతం రాములోరీ దర్శనానికి రావడం వల్ల అయోధ్యగ్లోబల్ టూరిజం హబ్‌గా మారడంతో పాటు, అనేక విధాలుగా పునర్వైభవం పొందుతుందని భావిస్తున్నారు.
మరోవైపు ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) ప్రభుత్వం అయోధ్యను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇక్కడ ఉద్యోగాలు పుష్కలంగా వస్తాయని, రాబోయే 4 నుండి 5 సంవత్సరాలలో ఆలయ పరిసర నగరాలు, పట్టణాలు అభివృద్ధిలో వేగం పుంజుకొంటుందని భావిస్తోంది. మరోవైపు హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ ప్లాట్‌ఫారమ్ బెటర్‌ప్లేస్ షో, అయోధ్య, పరిసర ప్రాంతాలలో దాదాపు 150,000-200,000 ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు వివిధ రంగాలలో సృష్టించబడతాయని అంచనా వేస్తోంది.
రాముడి దర్శనం కోసం అయోధ్యలో రద్దీ పెరుగుతున్న తీరు చూస్తుంటే రాబోయే సంవత్సరాల్లో ఇక్కడ వేగంగా అభివృద్ధి జరుగుతుందని ఆర్థిక నిపుణులు, ఉద్యోగ నిపుణులు అంచనా వేస్తున్నారు. కొద్ది నెలల్లో ప్రతిరోజూ 100,000-200,000 మంది పర్యాటకులు అయోధ్యను సందర్శించే అవకాశాలున్నట్టు..దీంతో వెంటనే 10 వేల నుంచి 30 వేల ఉద్యోగాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. మరోవైపు ఇక్కడ 1400 ఎకరాలలో కొత్త టౌన్‌షిప్‌ను ఏర్పాటు చేస్తున్నారు.
ఇది లక్నో-గోరఖ్‌పూర్ హైవేకి ఇరువైపులా ఉంటుంది. ఇందులో మఠం, ఆశ్రమం కోసం 28 ప్లాట్లు ఉంచారు. కాగా 12 ప్లాట్లు హోటళ్ల కోసం సిద్దం చేస్తున్నట్టు తెలిపారు. ఇలా సమాజంలోని ప్రతి వర్గాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ధర్మశాల, హోమ్ స్టే, హోటల్ తదితరాలను అభివృద్ధి చేస్తున్నారు. అదీగాక సరయూ ఒడ్డున థీమ్ పార్క్ నిర్మించడం, 14 కోసి పరిక్రమ మార్గ్ నిర్మించడం, రింగ్ రోడ్డు నిర్మించడం వంటి పనులు కూడా జరుగుతున్నాయి.