అయోధ్య(Ayodhya) నగరంలో 500 సంవత్సరాల తర్వాత అపురూప ఘట్టం ఆవిష్కృతమైంది. శ్రీరామ నవమిని పురస్కరించుకుని బుధవారం ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన అనంతరం వచ్చిన తొలి శ్రీరామ నవమి(Srirama Navami) కావడంతో విశేషమైన రోజుగా పండితులు చెబుతున్నారు. రామ నవమిని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు రామజన్మభూమి ప్రధాన అర్చకుడు ఆచార్య సత్యేంద్ర దాస్ తెలిపారు.
రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు తగు ఏర్పాట్లు చేసింది. ఇవాళ బాలరాముడి శిరస్సు సూర్యకిరణాలతో అభిషేకం చేయబడుతుంది. మధ్యాహ్నం 12.16 గంటలకు శ్రీరాముడు జన్మించిన సమయానికి సూర్యకిరణాలు దాదాపు 4 నిమిషాల పాటు స్వామివారి ఆయన తలపై పడతాయి. దీన్ని సూర్య తిలకంగా అభివర్ణిస్తారు. ఇందులో ప్రత్యేకత ఏంటంటే సైన్స్ సూత్రాల ప్రకారం ఈ ఘట్టాన్ని నిర్వహిస్తుండటం విశేషం. ఇప్పటికే సాంకేతిక ఏర్పాట్లు చేసినట్లు రామాలయ నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా తెలిపారు.
ఈ మహాద్భుతాన్ని తిలకించేందుకు ఉదయం నుంచి రామభక్తులు తమ ఆరాధ్యదైవాన్ని దర్శనం చేసుకుంటున్నారు. రాంలల్లాకు 56 రకాల నైవేద్యాలు సమర్పించనున్నారు. తెల్లవారుజామున 3.30గంటలకు బ్రహ్మ ముహూర్తంలో మంగళ హారతి, అభిషేకం, రాంలాల అలంకరణ చేశారు. రామ్ నగరంలో లేజర్, లైట్ షోతో ఆలయ ప్రాంగణం విరాజిల్లుతోంది. అదే సమయంలో కోట్వార్‌లో బీజేపీ ఎన్నికల ర్యాలీల్లో జై శ్రీరామ్ నినాదాలతో హోరెత్తించారు.
ర్యాలీలో హోంమంత్రి అమిత్ షా రామనవమి శుభాకాంక్షలు తెలిపారు. ఇది రామనవమి అని, 500 సంవత్సరాల తర్వాత రామ్ లల్లా తన పుట్టినరోజును డేరాలో కాకుండా గొప్ప ఆలయంలో జరుపుకోబోతున్నారని అన్నారు. ఇక్కడ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. చాలారోజుల క్రితం రామ నవమి సందర్భంగా ప్రజలు ఇప్పటికే గుమిగూడారని రామ్ లల్లా జన్మస్థలంలో దర్శనం పొందారని చెప్పారు.
అటు పశ్చిమ బెంగాల్లోని బాలూరట్‌లో జరిగిన ర్యాలీలో ప్రధాని మోడీ ప్రసంగిస్తూ సీఎం మమతా బెనర్జీ ప్రకటనలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. రామనవమి బొమ్మల తొలగింపునకు సంబంధించి కోర్టు నిర్ణయాన్ని స్వాగతించారు. రామనవమి ఉత్సవాలను ఇక్కడ ఆపేందుకు ఎప్పటిలాగే టీఎంసీ శాయశక్తులా ప్రయత్నించిందన్నారు. అన్ని కుట్రలు జరిగాయి, కానీ నిజం మాత్రమే గెలుస్తుంది. అందుకోసం కోర్టు నుంచి అనుమతులు లభించాయని మోడీ పేర్కొన్నారు.