కోట్లాది మంది భారత ప్రజల కల నేడు సాకారమైంది. అయోధ్యలో శ్రీరాముడు కొలువుదీరాడు. రామాలయం(Ram Mandir) ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(PM Modi) అయోధ్య(Ayodhya)కు చేరుకుని బాల రాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేశారు.
ప్రధాని మోడీతో పాటు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, యూపీ గవర్నర్ ఆనంది బెన్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పూజల్లో పాల్గొన్నారు. మరికొద్ది సేపట్లో ప్రధాని మోడీ దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. దీనికోసం ఆలయం పక్కనే వేదికను ఏర్పాటు చేశారు.
ఇదే వేదిక వద్ద 1992 డిసెంబర్ 6న రామమందిర ఉద్యమనేతలు ఇక్కడే ‘గుడి నిర్మిస్తాం’, ‘రాంలల్లా వస్తారు’ అంటూ నినాదాలు చేశారు. అయోధ్య రామ మందిర ప్రారంభ మహోత్సవానికి హాజరయ్యేందుకు అతిరథ మహారథులు పవిత్ర నగరానికి చేరుకుంటున్నారు.
రామాలయ ప్రారంభోత్సవానికి శీతల వాతావరణం, వయోభారం కారణంగా బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ గైర్హాజరయ్యే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. రామమందిర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఆయన ఆలయ ప్రారంభోత్సవానికి హాజరుకాకపోవడం చర్చనీయాంశమవుతోంది.
అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి 7వేలమందిని ఆహ్వానించగా అందులో 506మంది లిస్ట్ -ఏలో ఉన్నారు. ఇందులో ప్రముఖ రాజకీయ నేతలతోపాటు దిగ్గజ పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులు, దౌత్యవేత్తలు, న్యాయమూర్తులు, పూజారులు ఉన్నారు.