ప్రముఖ పుణ్యక్షేత్రం అయోధ్య(Ayodhya)లో బాలక్‌రామ్(Balak Ram) ప్రాణప్రతిష్ఠ అనంతరం భక్తుల రద్దీ విపరీతంగా పెరుగుతోంది. బాల రాముడిని తిలకించేందుకు దేశ విదేశాల నుంచి రామ భక్తులు తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్- (IRCTC) కీలక నిర్ణయాలు తీసుకుంది.
అయోధ్య రైల్వేస్టేషన్(Ayodhya Railway Station)లో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన రుచికరమైన వంటకాలను పర్యటకులకు అందుబాటులో ఉంచనుంది ఐఆర్టీసీ. రాష్ట్రాల వారీగా ఫుడ్ ప్లాజాలను ఏర్పాటు చేస్తోంది. ఉత్తరం నుంచి దక్షిణం వరకు, తూర్పు నుంచి పడమర వరకు ఏ రాష్ట్రానికి చెందిన పర్యటకులైనా తమ వంటకాలను ఆస్వాదించగలిగేలా చర్యలు తీసుకుంటున్నారు.
అదేవిధంగా దూరప్రాంతాల నుంచి వచ్చే పర్యటకులకు మెరుగైన వసతి ఏర్పాట్లు కూడా చేయనుంది ఐఆర్సీటీసీ. రైల్వే స్టేషన్లోనే అందుబాటు ధరలకు రిటైరింగ్ రూమ్‌ను ఏర్పాటు చేస్తోంది. ప్రయాణికుడు రైలు దిగిన వెంటనే రిటైరింగ్ రూమ్‌లో బెడ్ బుక్ చేసుకుని ఫ్రెష్ అవ్వవచ్చు. ప్రస్తుతం ఐఆర్సీటీసీ ఈ డార్మిటరీని సిద్ధం చేస్తోంది.
ఐఆర్సీటీసీ చీఫ్ రీజనల్ మేనేజర్ అజిత్ కుమార్ సిన్హా మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రధాని మోదీ ప్రారంభించిన కొత్త రైల్వే స్టేషన్ భవనంలో రిటైరింగ్ రూమ్‌తో ఫుడ్ ప్లాజాల నిర్మాణం జరుగుతోంది. టూరిస్ట్ ఫెసిలిటేషన్ సెంటర్‌ను కూడా నిర్మిస్తున్నాం. 200 నుంచి 300 మంది కూర్చునే సౌకర్యం ఉండే రిటైరింగ్ రూమ్‌ను నిర్మిస్తున్నాం. వసతి గృహంలో వందల సంఖ్యలో బెడ్లను ఏర్పాటు చేస్తున్నాం. ఫుడ్ ప్లాజాల్లో వివిధ రాష్ట్రాల వంటకాలు అందుబాటులో ఉంటాయి” అని తెలిపారు.