అయోధ్య (Ayodhya) రామ మందిరంలో ప్రతిష్టించిన ‘రామ్ లల్లా’విగ్రహాన్ని ఇక నుంచి కొత్త పేరుతో పిలవనున్నారు. రామ్ లల్లా విగ్రహాన్ని ‘బాలక్ రామ్’ (Balak Ram)గా పిలవనున్నట్టు పూజారి అరుణ్ దీక్షిత్ తెలిపారు. రామ్ లల్లా బాలుని రూపంలో ఉండటం, ఆయన వయస్సు ఐదేండ్లు ఉండటంతో ఇక నుంచి ఆ పేరుతో పిలవాలని నిర్ణయించామని చెప్పారు.
ప్రతిష్ఠాపన సమయంలో బాల రాముని విగ్రహాన్ని తొలిసారి చూసిన సమయంలో తాను పులకించి పోయానని పేర్కొన్నారు. ఆ సమయంలో తన కండ్ల నుంచి నీళ్లు వచ్చాయని వివరించారు. ఆ అనుభూతిని తాను మాటల్లో వివరించలేనన్నారు. ఇప్పటి వరకు తాను చేసిన ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాల్లో ఇది తనకు అత్యంత దైవికంగా, ఉన్నతమైనదన్నారు.
ఇది ఇలా వుంటే ప్రధాని నరేంద్ర మోడీ యూట్యూబ్ ఛానెల్ కొత్త రికార్డును సృష్టించింది. ప్రపంచంలో లైవ్ స్ట్రీమ్‌లో అత్యధికంగా మంది వీక్షించిన యూట్యూట్ ఛానెల్‌గా ప్రధాని మోడీ ఛానెల్ నిలిచింది. రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రధాని మోడీ యూట్యూబ్ ఛానెల్లో లైవ్ టెలికాస్ట్ చేయగా ఏకకాలంలో 90లక్షలమందికిపైగా ఒకేసారి వీక్షించారు.
ఒక యూట్యూబ్ ఛానెల్లో లైవ్ టెలికాస్ట్ ను ఒకే సమయంలో ఇంత మంది చూడటం రికార్డు. ఇప్పటి వరకు ఈ కార్యక్రమానికి కోటికి పైగా వ్యూవ్స్ వచ్చాయి. అంతకు ముందు చంద్రయాన్-3 మిషన్‌లో విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ ను లైవ్ టెలికాస్టు చేయగా అత్యధికంగా లైవ్‌లో 80లక్షల మంది వీక్షించారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ ఛానెల్ సబ్స్క్రైబర్ల సంఖ్య 2 కోట్ల మార్క్‌ను దాటింది.