ఉత్తరప్రదేశ్(Uttarpradesh)లోని అయోధ్య(Ayodya)లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది హిందువుల కలను తీరుస్తూ నిర్మించిన రామాలయం త్వరలో ప్రారంభోత్సవాలకు సన్నద్ధమైంది. ఈ నేపథ్యంలో బాల రాముడు ప్రాణ ప్రతిష్ఠ సమయం ఆసన్నమవుతున్న వేళ.. దాదాపు నెల రోజుల ముందే గుజరాత్‌లోని ఒక వజ్రాల వ్యాపారి రామ భక్తిని చాటుకున్నారు.
రామ మందిరం ఇతివృత్తంపై ఒక హారాన్ని తయారు చేయించాడు. 2024 ఏడాదిలో జనవరి 22వ తేదీన రాములోరి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవం జరపడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ సహా సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు, సాధువులు భారీ సంఖ్యలో భక్తులు హాజరుకానున్నారు.
సూరత్‌కు చెందిన ఓ వజ్రాల వ్యాపారి శ్రీరామచంద్ర స్వామికి ఏకంగా వజ్రాల హారం చేయించి తన భక్తిని చాటుకున్నాడు. 40 మంది నిపుణులు 35 రోజుల పాటు పాటు కష్టపడి ఈ హారాన్ని అతి సుందరంగా తయారు చేశారు. ఈ హారం అయోధ్య రామమందిరాన్ని పోలి ఉంది.
5వేల అమెరికన్ డైమండ్లు, 2కిలోల వెండితో చేసిన ఈ హారంలో మందిర నమూనాకే 3వేల వజ్రాలు వాడటం విశేషం. రాముడు, లక్ష్మణుడు, సీత, హనుమాన్ విగ్రహాలకు కూడా వజ్రాల హారాలు పొదిగారు.ఈ నెక్లెస్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జనవరి 22న ఈ వజ్రాల హారాన్ని అయోధ్య ఆలయ కమిటీకి అందజేయనున్నట్లు వజ్రాల వ్యాపారి తెలిపాడు.