అయోధ్య రామ మందిర(Ayodhya Ram Mandir) ప్రారంభోత్సవానికి మరో నాలుగు రోజుల సమయం మాత్రమే ఉంది. యావత్ దేశంతో పాటు ప్రపంచంలోనే రామ భక్తులు ఈ అపురూప ఘట్టం కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. జనవరి 22న రామ్ లల్లా(Ram Lala) విగ్రహ ప్రాణప్రతిష్ఠాపన కార్యక్రమంతో రామ మందిరం ప్రారంభానికి సిద్ధమైంది.
జనవరి 22వ తేదీ మధ్యాహ్నం 12:15 గంటల నుంచి 12:45 గంటల మధ్య ప్రాణ ప్రతిష్ఠాపన కార్యక్రమం జరుగుతుంది. గర్భగుడిలో బాల రాముడిని సూచించే విగ్రహం ఉంటుంది. “ప్రాణ ప్రతిష్ఠ” సమయంలో గర్భగుడిలో కేవలం ఐదుగురు మాత్రమే పూజలు చేయనున్నారు. వారిలో ప్రధాని నరేంద్రమోడీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, రామమందిరం ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ ఉన్నారు.
మొదటి బృందానికి స్వామి గోవింద్ దేవగిరి మహరాజ్, రెండవ బృందానికి శంకరాచార్య విజేంద్ర సరస్వతి, మూడవ బృందంలో కాశీ పండితులు పూజలు నిర్వహిస్తారు. “ప్రాణ ప్రతిష్ట” అనేది హిందూ మతంతో పాటు జైన మతంలో ఒక ప్రసిద్ధ ఆచారం. దేవతా విగ్రహాలను ప్రతిష్ఠించే సమయంలో పూజారులు వేద మంత్రోచ్ఛరణ మధ్య క్రతువును నిర్వహిస్తారు. ప్రాణ్ అంటే ప్రాణశక్తి, ప్రతిష్ఠ అంటే స్థాపన. విగ్రహానికి ప్రాణశక్తిని అవాహన చేయడమే ప్రాణ ప్రతిష్ఠ .
ప్రాణ ప్రతిష్ఠ సమయంలో ఆలయాన్ని మూసి ఉంచుతారు. స్వామి వారి కళ్లకు గంతలు తెరిచి, అద్దంలో ఆయనకు విగ్రహాన్ని చూపించడంతో కార్యక్రమం పూర్తవుతుంది. ఆ తర్వాత హారతి, మూడు బృందాల ఆచార్యుల పూజలు నిర్వహిస్తారు. ప్రధాన పోషకుడి పాత్ర పోషిస్తున్న ప్రధాని నరేంద్రమోడీ రాముడి విగ్రహానికి గంతలను తొలగించి, ఆ తర్వాత అద్దంలో విగ్రహాన్ని చూపించనున్నారు. తర్వాత హారతి ఇచ్చి భక్తులకు నైవేద్యాన్ని పంచిపెడతారు.