అయోధ్య రామ మందిరం గర్భగుడిలో ప్రతిష్టించాల్సిన ‘రామ్ లల్లా’ (Ram Lalla )విగ్రహాన్ని శ్రీ రామ జన్మభూమి ఆలయ నిర్మాణ కమిటీ ఏకగ్రీవంగా ఎంపిక చేసింది. రామ్ లల్లా విగ్రహ ఎంపిక ప్రక్రియ పూర్తయినట్టు ట్రస్టు సభ్యుడు బిమలేంద్ర మోహన్ ప్రతాప్ మిశ్రా (Bimalendra Mohan pratap Mishra) వెల్లడించారు. మొదట ముగ్గురు శిల్పులతో మూడు విగ్రహాలను తయారు చేశారు. అందులో దైవత్వం ఉట్టిపడేలా ఉన్న ఓ విగ్రహాన్ని ప్రాణ ప్రతిష్ట కోసం ఎంపిక చేశారు.
‘రామ్ లల్లా’ కండ్లు తామర రేకుల వలే ఉంటాయని చెప్పారు. చంద్రుని వలె కాంతి వంతమైన ముఖం, మోకాళ్ల వరకు విస్తరించిన పొడవాటి చేతులు, పెదవులపై అందమైన చిరునవ్వు, అంతర్లీనంగా దైవత్వం ఉట్టిపడేలా ఉండే విగ్రహం ఉంటుందన్నారు. రామ్ లల్లా విగ్రహాన్ని చూడగానే భక్తులు తమను తాము మైమరిచి పోతారని చంపత్ రాయ్ పేర్కొన్నారు.
51 అంగుళాల రామ్ లల్లా విగ్రహంలో రెండు భాగాలు ఉంటాయని చెప్పారు. అందులో ఒకటి కర్ణాటక నుంచి తీసుకు వచ్చిన శ్యామ్ శిలా రాయితో, రెండవ భాగాన్ని ఒక తెల్లని పాలరాయితో నిర్మించినట్టు వెల్లడించారు. సుమారు వేయి ఏండ్ల వరకు పునరుద్దరణ అవసరం లేకుండా ఈ విగ్రహాలను రూపొందించారని వివరించారు. ఈ విగ్రహాన్ని అధికారికంగా ప్రకటించే ముందు సమగ్ర పరిశీలనలు చేయనున్నారు.
రామ చరిత మానస్, వాల్మీకి రామాయణంలోని శ్రీరాముని వర్ణనలతో ఈ విగ్రహానికి పోలీకలు ఉన్నాయా లేదా అనే అంశాన్ని పరిశీలించనున్నారు. పసుపు, గంధం, ధూపం మొదలైన పూజాసామాగ్రి వల్ల ఈ విగ్రహంపై ఏదైనా ప్రభావం పడుతుందా లేదా అనే అంశాలను పరిశీలించనున్నారు. పరిశీలనల తర్వాత ఓకే అనిపిస్తే ఈ విగ్రహాన్ని ప్రాణప్రతిష్ట కోసం స్వీకరిస్తున్నట్టు అధికారికంగా వెల్లడించనున్నట్టు ట్రస్టు వర్గాలు పేర్కొన్నాయి.
జనవరి 22 మధ్యాహ్నం 12గంటల 20 నిమిషాలకు ‘రామ్ లల్లా’విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపతర్ రాయ్ వెల్లడించారు. అనంతరం హారతి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. తర్వాత స్థానికులు, భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. రామ్ లల్లా విగ్రహం దివ్యత్వం ఉట్టిపడేలా ఉంటుందని చెప్పారు.
అయోధ్య రామ మందిర గర్భ గుడిలో విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాలు జనవరి 16 నుంచి ప్రారంభం కానున్నాయి. 17న 51 అంగుళాల ‘రామ్ లల్లా’ విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకుని రానున్నారు. జనవరి 20న ఆలయాన్ని సరయూ నదీజలాలతో శుద్ధి చేస్తారు. అదే రోజు వాస్తు పూజలు నిర్వహిస్తారు. 21న రామ్ లల్లా విగ్రహానికి సంప్రోక్షణ నిర్వహించనున్నారు. 22న ఉదయం పూజల అనంతరం మృగశిర నక్షత్రంలో మధ్యాహ్న సమయంలో రామ్ లల్లా విగ్రహానికి శాశ్వత ప్రతిష్ఠ చేయనున్నారు.
మరోవైపు అయోధ్య రామ మందిరానికి విరాళాల పేరిట కొన్ని ముఠాలు భక్తులను దోచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయని వీహెచ్‌పీ పేర్కొంది. సామాజిక మాద్యమాల్లో క్యూ ఆర్ కోడ్‌లతో దోపిడీకి ప్రయత్నిస్తున్నారని హెచ్చరించింది. రామ మందిర నిర్మాణ పనులను శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ పర్యవేక్షిస్తుస్తోందని, అందువల్ల విరాళాల సేకరణకు మరెవరికీ అనుమతి ఇవ్వలేదని చెప్పింది.