అయోధ్య (Ayodhya)లో ‘రామ్ లల్లా’ (Ramlalla)విగ్రహ ప్రాణప్రతిష్టకు సమయం దగ్గర పడుతోంది. గర్బగుడిలో ప్రతిష్టించేందుకు మొదట ‘రామ్ లల్లా’విగ్రహాన్ని మూడు డిజెన్లలో రూపొందించారు. తాజాగా వాటిలో దైవత్వం ఉట్టిపడేలా ఉన్న ఒక విగ్రహాన్ని ప్రాణ ప్రతిష్ట కోసం ఎంపిక చేసినట్టు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వెల్లడించింది. ఆలయ గర్బగుడిలో ఆ విగ్రహాన్ని ప్రతిష్టించనున్నట్టు పేర్కొంది.
ఆలయ గర్భగుడిలో 51 అంగుళాల ఎత్తుతో ఐదేండ్ల బాలుని రూపంలో ఉన్న అయోధ్య రామయ్య విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. ఈ విగ్రహాన్ని 35 అడుగుల దూరం నుంచే రామ భక్తులు దర్శించుకునే భాగ్యాన్ని కల్పించనున్నారు. విల్లంబులు ధరించి, కమలంపై కూర్చొని ఉండే ఈ బాల రాముడికి సంబంధించి ముగ్గురు శిల్పులు వేర్వేరు విగ్రహాలను రూపొందించారు.
‘రామ్ లల్లా’విగ్రహ ఎంపిక కోసం ట్రస్టు కార్యాలయంలో ఓ సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో మూజువాణి ఓటింగ్ ద్వారా ‘రామ్ లల్లా’విగ్రహాన్ని ఎంపిక చేసినట్టు ట్రస్టు సభ్యుడు బిమలేంద్ర మోహన్ ప్రతాప్ మిశ్రా వెల్లడించారు. విగ్రహాన్ని మనం చూడగానే మనతో మాట్లాడినట్టు కనిపిస్తుందన్నారు. అందుకే విగ్రహాన్ని చూడగానే మనల్ని మనం మైమరిచి పోతామన్నారు.
దీనిపై ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ మాట్లాడుతూ….. అన్ని విగ్రహాలను ఒకే చోట ఉంచినప్పుడు మన దృష్టి కేవలం ఉత్తమమైన విగ్రహంపైనే పడుతుందన్నారు. అలా తన దృష్టి మూడింటిలో ఓ విగ్రహంపై పడిందన్నారు. వెంటనే ఆ విగ్రహానికి తాను ఓటు వేశానన్నారు. ఏకగ్రీవంగా ఎంపిక చేసిన విగ్రహాన్ని ప్రాణ ప్రతిష్ఠకు తీసుకువస్తామని చెప్పారు.
మరోవైపు ‘రామ్ లల్లా’ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాలు జనవరి 16 నుంచి ప్రారంభం కానున్నాయి. 17న 51 అంగుళాల బాల రాముని విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకు రానున్నారు. జనవరి 20న రామ మందిరాన్ని సరయూ నది జలాలతో శుద్ది చేస్తారు. 21న బాల రాముని విగ్రహ సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. 22న ఉదయం పూజల అనంతరం మృగశిర నక్షత్రంలో మధ్యాహ్న సమయంలో రామ్ లల్లా విగ్రహాన్ని శాశ్వత ప్రతిష్ఠ చేస్తారు.