అయోధ్య (Ayodhya) రామ మందిరంలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ నేపథ్యంలో ‘రాష్ట్ర’ వరుస కథనాలు అందిస్తోంది. ఈ క్రమంలోనే అయోధ్య అభివృద్ధిపై అక్కడి బీజేపీ (BJP) సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకుందో ఈ కథనంలో తెలుసుకుందాం. కేంద్ర సహకారంతో అయోధ్య రైల్వే స్టేషన్ ను పునరుద్ధరించడం, నూతన విమానాశ్రయం ఇలా పలు అభివృద్ధి పనులను చేపట్టింది యూపీ ప్రభుత్వం. రాబోయే రోజుల్లో నగరాన్ని మరింత అభివృద్ధి చేయాలని యోగి సర్కార్ భావిస్తోంది.
మాస్టర్ ప్లాన్ -2031లో భాగంగా అయోధ్య రూపురేఖలు మార్చేయాలని భావిస్తోంది. రూ.85 వేల కోట్లతో పలు ప్రణాళికలను అమలుపరుస్తోంది. ఇందులో భాగంగా 12 వందల ఎకరాల్లో ఒక ప్రత్యేక టౌన్ షిప్ ను నిర్మించనుంది. రాబోయే ఐదేండ్లలో దీన్ని రూ.2,200 కోట్ల నిధులతో డెవలప్ చేసేందుకు ప్రణాళికలు చేస్తోంది.
రామ మందిర ప్రారంభోత్సవం తర్వాత ఆధ్యాత్మిక, సాంస్కృతిక, వారసత్వ సంపదలపై దృష్టి సారిస్తే నగరం ప్రపంచ పర్యాటక గమ్యస్థానంగా మారుతుందని అంచనా వేస్తున్నారు. ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. 875 చ.కి.మీ. విస్తీర్ణంలో ఉన్న అయోధ్య డెవలప్ మెంట్ అథారిటీ ప్రాంతంలో(ప్రస్తుత మాస్టర్ ప్లాన్డ్ సిటీ ప్రాంతం 133 చ.కి.మీ., కోర్ సిటీ 31.5 చ.కి.మీ.) మౌలిక సదుపాయాలు, పర్యాటక అభివృద్ధిని ఈ ప్రణాళికలో భాగంగా కల్పించనున్నారు.
అర్కిటెక్ట్, అర్బన్ ప్లానర్ దిక్షు కుక్రేజాకు చెందిన సంస్థ అయోధ్య కోసం విజన్ డాక్యుమెంట్ ను రూపొందించింది. నగరంలో ఇప్పటికే ప్రధాన కూడళ్లు, రహదారుల సుందరీకరణ పనులను శరవేగంగా పూర్తి చేస్తోంది. ఆలయానికి వెళ్లే మార్గానికి ఇరువైపులా సూర్య స్తంభాలను ఏర్పాటు చేశారు. ఐదు కిలోమీటర్లుగా ఉండే నగరం తాజాగా అభివృద్ధి పనుల నేపథ్యంలో 20 కిలోమీటర్లకు పెరుగుతోంది. రామాయణంలో వాల్మీకి వర్ణించినట్టుగా ఉండేలా అయోధ్యను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది.
ఉద్యాన వనాలు, రోడ్లు భవనాలు, లైటింగ్, ఫిక్చరింగ్, భవనాల రూపకల్పన రామాయణం ఆధారంగా చేపట్టినట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. నగరంలో పర్యాటక ప్రదేశాలను ప్రభుత్వం పునరుద్ధరిస్తోంది. దశరథుని సమాధి, సీతా మహల్, తీన్ కలాస్ పునరుద్దరణ పనులు జరుగుతున్నాయి. భక్తుల రద్దీగా ఉండే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది.
నగరంలో విద్యుత్ వాహనాలను ఉపయోగించేలా చర్యలు తీసుకుంటోంది. తొలి విడతలో 12 వాహనాలు ఉండగా వాటిని 500 లకు పెంచుతామని చెబుతోంది. ఆలయాన్ని నాగర శైలిలో నిర్మిస్తున్నారు. 380 అడుగుల పొడవు 250 అడుగుల వెడల్పు 161 అడుగుల ఎత్తుతో మందిరాన్ని నిర్మించారు.
అయోధ్యను అంతర్జాతీయ పుణ్యక్షేత్రంగా ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించేలా ఒక స్వర్గధామంగా తయారు చేస్తున్నారు. ఈ క్రమంలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించారు. దీనికి ‘‘మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం, అయోధ్యధామ్’’ అని పేరు పెట్టారు. కేవలం 20 నెలల్లో రూపొందిన ఈ ఎయిర్ పోర్టు విశేషాలను తర్వాతి కథనంలో చూద్దాం.