దేశంలో అయోధ్య రామ మందిరానికి(Ayodhya Rama Mandir) రోజురోజుకు భక్తుల సంఖ్య పెరుగుతోంది. అందుకు తగినట్లుగానే అధికారులు ముందస్తు చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలో అయోధ్య రామ మందిరం మరో ఉత్సవానికి వేదిక కానుంది. ఆలయ ప్రారంభోత్సవం తర్వాత తొలిసారి శ్రీరాముడి జన్మదిన వేడుకలను నిర్వహించనున్నారు.
ఈ వేడుకను అత్యంత వైభవోపేతంగా నిర్వహించేందుకు ట్రస్టు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఏప్రిల్ 17న శ్రీరాముడి జన్మదిన సందర్భంగా మూడు రోజుల పాటు ఉత్సవాలను పెద్దఎత్తున నిర్వహించాలని శ్రీరామ తీర్థక్షేత్ర ట్రస్టు(Sri Rama Tirthakshetra Trust) నిర్ణయించింది. బలరాముడి ప్రాణప్రతిష్ఠాపన అనంతరం అయోధ్యలో జరగనున్న తొలి కార్యక్రమం ఇదే కానున్న తరుణంలో భక్తులు పెద్ద సంఖ్యలో బాల రాముడిని దర్శించుకునేందుకు వస్తారని ట్రస్టు అంచనా వేస్తోంది.
ఈ మేరకు ఏప్రిల్ 17వ తేదీ నుంచి మూడు రోజులు 24గంటల పాటు ఆలయ తలుపులు తెరిచి ఉంటాయని అధికారులు వెల్లడించించారు. బలరాముడికి నైవేద్యాలు సమర్పించే సమయంలో మాత్రమే భక్తుల దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేస్తామని తెలిపారు. ఈ ఉత్సవాలకు ఇంకా నెల రోజులు సమయం ఉన్నప్పటికీ అధికారులు ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రస్తుతం సామాన్య భక్తుల దర్శనం కోసం అయోధ్య రామ మందిరం తలుపులు ఉదయం 6:30 నుంచి రాత్రి 9:30 గంటల వరకు తెరుస్తున్నారు. ఈ సమయాల్లోనే బలరాముడు భక్తులకు దర్శనాన్ని కల్పిస్తున్నారు. ఏప్రిల్ 17, 18, 19 తేదీల్లో ఉత్సవాల్లో పాల్గొనేందుకు దేశ, విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు బాల రాముడిని దర్శించుకునే అవకాశాలు ఉండటంతో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించనున్నారు.