బీజేపీ (BJP)కి భారీ షాక్ తగిలింది. సినీ నటుడు, మాజీ మంత్రి బాబూ మోహన్ (Babu Mohan) బీజేపీకి రాజీనామా చేశారు. పార్టీలో తనకు సరైన ప్రాధాన్యత లభించడం లేదని ఆయన వాపోయారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ పెద్దల వైఖరి తీవ్ర అభ్యంతకరంగా ఉందని వెల్లడించారు. అందుకే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు.
మీడియా సమావేశంలో బుధవారం బాబూ మోహన్ మాట్లాడుతూ….. బీజేపీ కోసం తాను చాలా కష్టపడ్డానని అన్నారు. బీజేపీలో తనకు అవమానాలు ఎదురైతున్నట్టు వెల్లడించారు. పొమ్మనకుండా పొగపెడుతున్నారని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి తనను దూరం పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కనీసం తన ఫోన్ కూడా ఎత్తకుండా బీజేపీలోని కొంత మంది నేతలు తనను ఇబ్బంది పెడుతున్నారంటూ వివరించారు. కేవలం రాష్ట్రంలోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రచారం చేశానన్నారు. ఏ, బీ, సీ, డీ సెక్షన్లుగా నాయకులను విభజించారన్నారు. తనను అత్యంత అవమానకరంగా డీ కేటగిరిలో పెట్టారంటూ వాపోయారు.
తనను అవమానించడానికే రాష్ట్ర బీజేపీ పెద్దలు నిర్ణయించుకున్నారని తనకు అర్థమైందని చెప్పుకొచ్చారు. అందుకే బీజేపీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నానని స్పష్టం చేశారు. రేపు రాజీనామా లేఖను పంపుతానన్నారు. ఎప్పటికైనా వరంగల్ ప్రజలకు ఎంపీగా సేవలదించాలని తాను నిర్ణయించుకున్నట్టు చెప్పారు.
2018, 2023లో అందోల్ నియోజ వర్గంలో బీజేపీ తరఫున బాబూ మోహన్ బరిలోకి దిగారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన మూడవ స్థానంలో నిలిచారు. వరంగల్ ఎంపీ టికెట్ ను ఆయన ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఆయనకు వరంగల్ టికెట్ ఇచ్చేందుకు బీజేపీ పెద్దలు సుముఖంగా లేరని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన రాజీనామా చేసినట్టు సమాచారం.