Telugu News » Hyderabad : జీవో జగడం.. కాంగ్రెస్ సర్కార్ కు సొంత పార్టీ నేత డెడ్ లైన్

Hyderabad : జీవో జగడం.. కాంగ్రెస్ సర్కార్ కు సొంత పార్టీ నేత డెడ్ లైన్

జీవో 46 వల్ల హరిప్రసాద్ అనే నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడని ఓయూలో ధర్నా చేశారు. పట్టణ ప్రాంతానికి చెందిన వారికి 60 మార్కులు వచ్చినా ఉద్యోగం దక్కిందని.. గ్రామీణ ప్రాంతానికి చెందిన నిరుద్యోగుల్లో చాలామందికి 120కి పైగా మార్కులు వచ్చినా రాలేదని వాపోయారు.

by admin
bakka-judson-demands-to-cancel-go46

– జీవో 46కు బలైన మరో నిరుద్యోగి
– ఓయూలో నిరుద్యోగుల ధర్నా
– మద్దతు తెలిపిన కాంగ్రెస్ నేత బక్క జడ్సన్
– జీవోను సవరించాలని డిమాండ్
– లేదంటే, 21న నిరాహార దీక్ష
– ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్న జడ్సన్

ఉద్యోగాలకు సంబంధించి కేసీఆర్ (KCR) ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 46పై ఇప్పటికీ ఆందోళనలు కొనసాగుతున్నాయి. తాజాగా ఉస్మానియా యూనివర్సిటీ (Osmania University) లో నిరుద్యోగులు ధర్నా చేశారు. దీనికి కాంగ్రెస్ (Congress) నాయకుడు బక్క జడ్సన్ (Bakka Judson) మద్దతు తెలిపారు. ఈ జీవో రద్దు కోసం కేసీఆర్ ప్రభుత్వంపై యుద్ధం చేశామని.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయాలని కోరారు. లేకపోతే, ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని స్పష్టం చేశారు.

bakka-judson-demands-to-cancel-go46

రాష్ట్రంలో కొత్త జిల్లాల వారీగా ఉద్యోగుల విభజనకు సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం 2021 డిసెంబర్ 6న జీవో 317ను జారీ చేసింది అప్పటి కేసీఆర్ సర్కార్. కానీ, కొన్నిశాఖలకు జిల్లాలవారీగా యూనిట్లు లేకపోవడంతో.. 9 శాఖలకు సంబంధించి 2022 ఏప్రిల్‌ 4న జీఓ 46ను తీసుకొచ్చింది. గతంలో టీఎస్ఎస్​పీ కానిస్టేబుల్‌ పోస్టులు రాష్ట్రస్థాయి కేటగిరీలో ఉండటంతో 2016, 2018 నాటి నోటిఫికేషన్లలో ఇబ్బందులు తలెత్తలేదు. రాష్ట్రపతి ఆమధ్య తీసుకొచ్చిన ఉత్తర్వులకు అనుగుణంగా జనాభా ప్రాతిపదికన జిల్లాలకు పోస్టుల నిష్పత్తి కేటాయించారు. ఈ నిష్పత్తి ప్రకారం హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో దాదాపు 53 శాతం ఉద్యోగాలు, మిగిలిన 27 పోలీస్ యూనిట్లన్నింటిలో కలిపి 47 శాతం పోస్టులు భర్తీకి చర్యలు తీసుకున్నారు. అయితే.. దీనిపై గ్రామీణ ప్రాంత అభ్యర్థులు నిరసన బాట పట్టారు.

జీవో 46 వల్ల హరిప్రసాద్ అనే నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడని ఓయూలో ధర్నా చేశారు. పట్టణ ప్రాంతానికి చెందిన వారికి 60 మార్కులు వచ్చినా ఉద్యోగం దక్కిందని.. గ్రామీణ ప్రాంతానికి చెందిన నిరుద్యోగుల్లో చాలామందికి 120కి పైగా మార్కులు వచ్చినా రాలేదని వాపోయారు. నిరుద్యోగుల ధర్నాకు కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ మద్దతు తెలిపారు. అత్యధిక మార్కులు వచ్చినా ఉద్యోగం రాకపోవడంతో హరిప్రసాద్ చనిపోయాడని.. కేవలం ఓటు బ్యాంకు రాజకీయం కోసం కేసీఆర్ ఆ జీవోను తీసుకొచ్చారని మండిపడ్డారు.

30 లక్షల మంది నిరుద్యోగుల వల్లే బీఆర్ఎస్ ఓటమి పాలయ్యిందన్నారు జడ్సన్. 46 జీవోపై ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని.. దాన్ని నిలబెట్టుకోవాలని సీఎం రేవంత్ ను కోరారు. తనకు పదవులు ముఖ్యం కాదన్నారు. వెంటనే, జీవో 46ను సవరించాలని డిమాండ్ చేశారు. లేకపోతే గురువారం (ఈనెల 21) అమరవీరుల స్తూపం దగ్గర నిరాహార దీక్ష చేస్తానన్నారు. పదేళ్లు కేసీఆర్ తో కొట్లాడామని.. మన ఇంటివాళ్లతో కొట్లాడడం పెద్ద పని కాదని చెప్పారు. అక్కడి దాకా తెచ్చుకోవద్దని రేవంత్ కు సూచించారు బక్క జడ్సన్.

You may also like

Leave a Comment