ఇద్దరు అధికారులపై సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ ఫిర్యాదు చేశారు. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ( TSIIC) వైస్ ఛైర్మన్, ఎంపీ నర్సింహారెడ్డి, టీఎస్ఐఐసీ సీఈఓ (Project)మధుసూదన్లపై చర్యలు తీసుకోవాలని ట్విట్టర్లో సీఎంను ఆయన కోరారు.
సదరు అధికారులు గత పదేళ్లుగా ఒకే పదవిలో కొనసాగుతున్నారని జడ్సన్ అన్నారు. ఆ అధికారులు అనేక అవకతవకలకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. అందువల్ల నర్సింహారెడ్డితో పాటు మధుసూదన్లను తమ పదవుల్లో కొనసాగించే విషయంలో ప్రభుత్వం మరోసారి పరిశీలనలు చేయాలని విజ్ఞప్తి చేశారు.
వీరిద్దరూ కలిసి రహస్య పద్దతిలో ప్రభుత్వ భూముల కేటాయింపుల విషయంలో అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు గుప్పించారు. ఆయా అధికారుల అవినీతిపై సీఐడీతో దర్యాప్తు జరిపించాలని ఈ సందర్బంగా డిమాండ్ చేశారు. ఈ పోస్టులో సీఎం రేవంత్ రెడ్డితో పాటు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబును జడ్సన్ ట్యాగ్ చేశారు.
ఇది ఇలా వుంటే ప్రైవేట్ సంస్థలకు భూముల కేటాయించే విషయంలో టీఎస్ఐఐసీ ఉన్నతాధికారులు భారీగా అవినీతికి పాల్పడ్డారంటూ ఆరోపణలు వున్నాయి. ఓ వైపు హైదరాబాద్ నగర శివార్లలో రూ.వందల కోట్ల విలువైన ప్రభుత్వ (TSIC)భూములు కబ్జాలకు గురవుతున్నా అధికారులు పట్టించుకోవం లేదంటూ ఆరోపణలు వస్తున్నాయి.