తనపై టీడీపీ చేసిన ఆరోపణలు రుజువు చేస్తే తన ఆస్తి మొత్తం రాసిస్తానని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి(Balineni Srinivasa Reddy) సవాల్ విసిరారు. ప్రకాశం జిల్లా(Prakasham District) ఒంగోలు(Ongole)లో ఇళ్ళ పట్టాల పంపిణీ కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(CM Jaganmohan Reddy) హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్ విగ్రహానికి సీఎం జగన్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఒంగోలు సీఎం జగన్ సభలో బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. యర్రజర్లలో పేదలకు ఇళ్ల స్థలాల విషయంలో టీడీపీ అడ్డంకులు సృష్టించిందన్నారు.
అగ్రహారం, వెంగముక్కల పాలెంలలో భూములు చూశామని, అయితే అక్కడా టీడీపీ కోర్టు కేసులు వేయించి ఇబ్బందులు పెట్టిందని బాలినేని శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించారు. భూములకు తనకు ఎకరాకు రూ.8లక్షలు ఇచ్చారని ఆరోపిస్తున్నారని, ఆ ఆరోపణలు రుజువు చేస్తే తన ఆస్తి మొత్తం రాసిస్తానని అన్నారు. ఒంగోలులో పేదలకు సొంతింటి కల సాకారం చేసిన ఘనత సీఎం జగన్‌కే దక్కిందన్నారు.
సీఎం జగన్ ఇచ్చిన భరోసా వల్లే ధైర్యంగా పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వలేకుంటే ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పానని అన్నారు. ఈ కార్యక్రమానికి మంత్రులు ధర్మాన ప్రసాదరావు, ఆదిమూలపు సురేష్, మేరుగ నాగార్జున, ఎమ్మెల్యేలు కరణం బలరాం, అన్నా రాంబాబు, బుర్రా మధుసూదన్ యాదవ్, కేపీ నాగార్జున రెడ్డి పాల్గొన్నారు.