సీఎం కేసీఆర్(CM kcr) పై చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి వివేక్(Vivek) చేసిన ఆరోపణలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్(Balka Suman) ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ మీడియా సమావేశంలో మాట్లాడారు. వివేక్ మాట్లాడిన వీడియోను ఆయన వినిపించారు.
తెలంగాణ కోసం చావు నోట్లో తలపెట్టిన నాయకుడిని పట్టుకొని అలా మాట్లాడతారా? అంటూ బాల్క సుమన్ మండిపడ్డారు. ఓటమి భయంతోనే వివేక్ అలా మాట్లాడుతున్నారని విమర్శించారు. చెన్నూరులో ధన రాజకీయం నడుస్తోందని బాల్క సుమన్ అన్నారు. వివేక్ మాటలు దొంగే.. దొంగా దొంగా.. అని అరిచిన చందంగా ఉందని బాల్క సుమన్ ఎద్దేవా చేశారు. ఆయన షెల్ కంపెనీకి ఎనిమిది కోట్లు ఎలా వచ్చాయో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ నాయకులను కాంగ్రెస్ పార్టీలోకి లాక్కోవడంపై బాల్కసుమన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వివేక్ సంస్థలోని ఉద్యోగులు చెన్నూర్లోనే పాగా వేసి డబ్బులతో తమ లీడర్లను కొంటున్నారని ఆరోపించారు. ‘డబ్బుతో మా లీడర్లను కొంటున్నారు.. నేను అటు తిరిగి ఇటు చూసేసరికి నాయకులను కొనేస్తున్నారు.’ అంటూ బాల్క సుమన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
వివేక్ కంపెనీ ప్రతినిధులపై రెయిడ్స్ జరిగితే తమకేం సంబంధమని బాల్క సుమన్ అన్నారు. తమ లీడర్లపైనా దాడులు జరిగాయని చెప్పారు. 27 తేదీన ప్రజా కోర్టులో వివేక్ కొనుగోలు చేసిన లీడర్ల లిస్టు బయట పెట్టుతానని ఆయన చెప్పుకొచ్చారు. బీజేపీ వాళ్లను వెన్నుపోటు పొడిచి కాంగ్రెస్లోకి వెళ్లిన వివేక్ దమ్ముంటే అభివృద్ధి పైన మాట్లాడాలని, లేదా బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఎన్నికల్లో వివేక్ ఓటమి ఖాయమని జోస్యం చెప్పారు.