మంచిర్యాల (manchiryala) జిల్లా చెన్నూరు (Chennur) అధికార పార్టీ ఎమ్మెల్యే (MLA), విప్ బాల్క సుమన్ (Balka Suman) చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. రెండు రోజుల క్రితం మందమర్రి (Mandamarri) లో జరిగిన కార్యకర్తల సమావేశంలో ప్రధాన మీడియాతో పాటు సోషల్ మీడియా అంతా తనకు అనుకూలంగా ఉందంటూ మాట్లాడుతూనే కొందరు వంకరగాళ్లు ఉంటారని, వాళ్ళ పని పట్టండి అంటూ పార్టీ కార్యకర్తలకు సుమన్ హుకుం జారీ చేశారని ప్రచారం జరిగింది.
అయితే ప్రస్తుతం కలకలం సృష్టిస్తున్న ఈ వ్యాఖ్యలని నెటిజన్లు తప్పు పడుతున్నారు. బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలు లీక్ కావడంతో పస్తుతం చెన్నూరు బీఆర్ఎస్ కార్యకర్తలు ఆలోచనలో పడిపోయే పరిస్థితి వచ్చిందని అంతా అనుకుంటున్నారు. మరి కొంతమంది బీఆర్ఎస్ నాయకులు అయితే వదిలేయండని, అలసటగా ఉన్నందున ఫ్లో లో అని ఉంటారని సమాధానం చెప్తున్నారని అంటున్నారు.
అయినప్పటికీ ఎక్కువ మంది నెటిజన్లు మాత్రం జర్నలిస్టులను ఉద్దేశించి సుమన్ అలా కామెంట్ చేయడం సరికాదన్న అభిప్రాయాలనే వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలను జర్నలిస్టులతో పాటు ప్రజాసంఘాలు, వివిధ రాజకీయ పార్టీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. కాగా ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టులు నిరసనలు కొనసాగిస్తున్నారని, మరోవైపు మంచిర్యాల, మందమర్రిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి..