చెన్నూరు (Chennuru) రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. నియోజకవర్గంలో మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత వివేక్ వెంకట స్వామి.. ఎమ్మెల్యే బాల్క సుమన్ (Balkasuman) మధ్య మాటల యుద్ధం రచ్చగా మారింది. ఇప్పటికే నామినేషన్ సమయంలో ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకున్న విషయ తెలిసిందే.
మరో సారి వీరి మధ్య నిప్పు రాజుకుంది. ఎన్నికల ప్రచారంలో వివేక్ వెంకట స్వామి డబ్బులు పంచుతున్నారని ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే బాల్క సుమన్.. మంచిర్యాల జిల్లాలో ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ ని కలిసి ఫిర్యాదు చేశారు. వివేక్ పక్కన ఉన్న వారి అకౌంట్స్ లోకి డబ్బులు జమ చేస్తూ.. చెన్నూరు నియోజకవర్గం ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని తెలిపారు.
ఈ విషయాన్ని ఎన్ఫోర్స్ మెంట్, ఇన్కమ్ టాక్స్ వాళ్ల దృష్టికి కూడా తీసుకెళ్తానని బాల్క సుమన్ వెల్లడించారు.. వివేక్ (vivek) కుటుంబ సభ్యుల అకౌంట్స్ పై నిఘా పెట్టి.. అకౌంట్స్ ని ఫ్రీజ్ చేయమని సీఈఓని కోరినట్టు బాల్క సుమన్ తెలిపారు. మరోవైపు పెట్రోల్, బిల్డర్స్, రైస్ మిల్స్, సిమెంట్, స్టిల్ కంపెనీల వాళ్లకు హైదరాబాద్ (Hyderabad) నుంచి వివేక్ డబ్బులు పంపుతున్నారని ఆరోపించారు. వ్యాపారులను ఉద్దేశించి మాట్లాడిన బాల్క సుమన్.. వివేక్ కుటుంబం చేస్తున్న పాపంలో పాలు పంచుకోవద్దని కోరారు. డబ్బులతో రాజకీయాలు చేయాలని వివేక్ చూస్తున్నారంటూ మండిపడ్డారు..