– బీసీని ముఖ్యమంత్రి చేసే దమ్ముందా?
– కేసీఆర్ కు బండి సవాల్
– నిరుద్యోగులందరూ ఏకం కావాలి
– కేసీఆర్, కేటీఆర్ కు బుద్ధి చెప్పాలి
– బీజేపీని గెలిపించాలి
– ఎన్నికల ప్రచారం మొదలుపెట్టిన సంజయ్
మంత్రి కేటీఆర్ (KTR) కు అహంకారం ఎక్కువైందని విమర్శించారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ (Bandi Sanjay). జాబ్ క్యాలెండర్ పై ఇప్పుడు హామీలు చేస్తున్నారని.. పది సంవత్సరాల నుండి ఏం చేశారని ప్రశ్నించారు. కరీంనగర్ (Karimnagar) లో ఎన్నికల ప్రచారం మొదలు పెట్టిన ఆయన.. బీజేపీ (BJP) అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని.. సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో తాను గెలవకుండా కేసీఆర్ (KCR) ప్లాన్ చేశారని ఆరోపించారు. తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ (BRS) సంగతి చూస్తేగానీ న్యాయం జరగదని నిరుద్యోగులకు సూచించారు బండి. నిరుద్యోగులు గత పదేళ్లుగా పడ్డ కష్టాలు మర్చిపోవద్దని తెలిపారు. పరీక్షలు కూడా సరిగ్గా నిర్వహించలేని ఈ దద్దమ్మ సర్కార్ ను సాగనంపుదామని పిలుపునిచ్చారు. నిరుద్యోగుల కోసం బీజేపీ నేతలు జైలుకు వెళ్లారని గుర్తు చేశారు. రాష్ట్రంలో 50 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు వీరంతా బుద్ధి చెప్పాలని కోరారు. తెలంగాణలో బీజేపీ గెలుస్తుందని కేసీఆర్ కు భయం పట్టుకుందన్నారు.
నామినేషన్ రోజున జరిగిన ర్యాలీ చరిత్ర సృష్టించిందని చెప్పారు సంజయ్. స్వచ్ఛందంగా ప్రజలు తరలివచ్చారన్నారు. 30 తేదీన విజయానికి ఇది సంకేతమని, రాష్ట్ర ముఖ్యమంత్రి కరీంనగర్ లో బీజేపీ గెలుస్తుందని డిసైడ్ చేసారన్నారు. తాను భూదందాలు చేయలేదని, కబ్జాలకు పాల్పడలేదని తెలిపారు. కరీంనగర్ అభివృద్ధికి నిధులు తీసుకువచ్చింది ఎవరు? అభివృద్ధికి అడ్డం పడింది ఎవరని ప్రశ్నించారు. తాను అసెంబ్లీలో అడుగు పెట్టవద్దంటూ వేల కోట్లు రూపాయలను కరీంనగర్ కి పంపుతున్నారని వ్యాఖ్యానించారు.
‘‘బీసీ వర్గానికి చెందిన వ్యక్తిని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పాం. కేసీఆర్ కి బీసీ ముఖ్యమంత్రి ని చెస్తానని చెప్పే దమ్ము, ధైర్యం ఉందా? గతంలో చెప్పినట్లు ఎస్సీని ముఖ్యమంత్రి చేస్తారా? బంగారు తెలంగాణ అని బర్బాజ్ చేశారు. ఈ పోరాటం కేసీఆర్ కుటుంబం అహంకారానికి, తెలంగాణ ప్రజలకి మధ్య జరుగుతోంది. కేసీఆర్ రాజ్యాంగం కావాలా? అంబేద్కర్ రాజ్యాంగం కావాలా? తెలంగాణ రాష్ట్రంలో దొంగలంతా బీఆర్ఎస్ లో చేరారు. ఒకసారి బీజేపీకి అవకాశం ఇవ్వండి. ప్రశ్నించే గొంతుని అణచివేయకండి.. గెలిపించండి’’ అని కోరారు బండి సంజయ్.