– కేటీఆర్ పై బీజేపీ వర్గాలు, హిందూ సంఘాల ఆగ్రహం
– రజాకార్ సినిమాపై వ్యాఖ్యల్ని తప్పుబడుతున్న నేతలు
– ఆనాటి అకృత్యాలు నిజం కాదా?
– రజాకార్ల రాక్షసత్వాన్ని సమర్ధిస్తున్నారా?
– నిజాం నిరంకుశ పాలనను కొనసాగిస్తారా?
– కేటీఆర్ కు బండి సంజయ్ కౌంటర్
– ఇది ట్రైలర్ మాత్రమేనంటూ సెటైర్
– వాస్తవాలు చూపిస్తే బాధేస్తుందా? అంటూ ఫైర్
రజాకార్ (Razakar) సినిమా చుట్టూ రాజకీయ రగడ మొదలైంది. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఈ సినిమా ఉందంటూ ఓ వ్యక్తి చేసిన ట్వీట్ పై స్పందించిన మంత్రి కేటీఆర్ (KTR). ఈ విషయాన్ని సెన్సార్ బోర్డ్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. అంతేకాదు, లా అండ్ ఆర్డర్ దిగజారకుండా పోలీసులు చూసుకుంటారని చెప్పారు. పైగా, బీజేపీ (BJP) నేతలను జోకర్లు అని వ్యాఖ్యానించారు. ఈ కామెంట్స్ పై బీజేపీ వర్గాలు, హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. ఆనాడు హిందువులపై జరిగిన దాడులను సమర్ధిస్తున్నారా? అని కేటీఆర్ ను ప్రశ్నిస్తున్నాయి.
కేటీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ బండి సంజయ్ (Bandi Sanjay) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరుపుతామని చెప్పి.. ఇప్పుడు ట్రాక్ మార్చారని మండిపడ్డారు. రజాకార్ల అకృత్యాలను సినిమా రూపంలో చూపిస్తే.. ట్విట్టర్ టిల్లు(ఎక్స్ టిల్లు)కు ప్రాబ్లమ్ గా ఉందా అంటూ ఎద్దేవ చేశారు. ఇది కేవలం ట్రైలర్ మాత్రమేనని.. అసలు సినిమా ముందుందని కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చారు సంజయ్. ఇదే సందర్భంలో మరో విషయాన్ని ఆయన ప్రస్తావించారు. హిందువుల పండుగ వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పలేదు కానీ.. రజాకార్ల మారణహోమాన్ని చూపించిన సినిమాపై దాడి చేయాలని నిర్ణయించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చరిత్రను తుడిచిపెట్టే పనికిమాలిన ప్రయత్నాలకు బదులు ట్విట్టర్ టిల్లుకు కొంత స్పృహను కలిగించమని అందరం గణేశుడిని ప్రార్థిద్దాం అంటూ కౌంటర్ ట్వీట్ చేశారు బండి సంజయ్. సోషల్ మీడియాలో ఈ అంశం చుట్టూ దుమారం చెలరేగింది. హిందూ సంఘాలు కూడా కేటీఆర్ తీరును తప్పుబడుతున్నాయి. ఆనాటి రజాకార్ల రాక్షసత్వాన్ని, నిజాం నిరంకుశత్వాన్ని, హిందువుల జీవితాన్ని కళ్లకు కట్టినట్టు రజాకార్ సినిమాలో చూపించారని.. ఇందులో తప్పేముందని అంటున్నాయి. నిజాం పాలనలో హిందువులపై జరిగిన దాడులు నిజం కాదా? అని కేటీఆర్ ను ప్రశ్నిస్తున్నాయి. హిందువులను.. హిందూ దేవుళ్ళను అవమానించేలా సినిమాలు తీస్తే మౌనం, ఇతర మతస్తులపై ఈగ వాలితే గగ్గోలు.. కొందరు పెక్యులరిస్ట్ లకు అలవాటుగా మారిపోయిందని మండిపడుతున్నాయి. ఇన్నాళ్లకు ఆనాటి దారుణ అకృత్యాలను చూపిస్తూ రజాకార్ చిత్రం తీస్తే ఎందుకు జీర్ణించుకోలేకపోతున్నారని ప్రశ్నిస్తున్నాయి.
తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా రజాకార్ మూవీ టీజర్ రిలీజ్ అయింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన టైంలో తెలంగాణలో హిందువులపై జరిగిన అరాచకాలను కళ్ళకి కట్టినట్టు చూపించారు. అయితే.. ఇందులో ముస్లిం వర్గాన్ని తప్పుగా చూపించారని వివాదం మొదలైంది. ఈ క్రమంలోనే కేటీఆర్ స్పందిస్తూ.. ‘‘కొంతమంది తెలివి విషయంలో దివాలా తీసిన బీజేపీ (BJP) జోకర్స్ స్వార్థ రాజకీయాల కోసం తెలంగాణలో మత విద్వేషాలు సృష్టించాలని శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. రజాకార్ సినిమా విషయం సెన్సార్ బోర్డ్ దృష్టికి తీసుకెళ్తాం. తెలంగాణ పోలీసులు కూడా లా అండ్ ఆర్డర్ పరిస్థితి దిగజారకుండా చూసుకుంటారు” అని ట్వీట్ చేశారు. దీనిపై బీజేపీ వర్గాలు, హిందూ సంఘాలు మండిపడుతున్నాయి.