మంత్రి గంగుల కమలాకర్ ఎన్నిక వివాదంపై ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో క్రాస్ఎగ్జామినేషన్ ప్రక్రియ ఈ రోజు ముగిసింది. బండి సంజయ్ ను క్రాస్ ఎగ్జామిన్ చేసేందుకు అనుమతించాలని అడ్వకేట్ కమిషనర్ ను గంగుల తరఫు న్యాయవాదులు కోరారు. దీంతో వారి విజ్ఞప్తిని అడ్వకేట్ కమిషనర్ అంగీకరించారు.
విచారణ సందర్బంగా గంగుల తరపు న్యాయవాదులు అడిగిన ప్రశ్నలకు బండి సంజయ్ స్పష్టమైన వివరణ ఇచ్చారు. క్రాస్ ఎగ్జామిన్ పూర్తి కావడంతో కేసు తదుపరి విచారణను ఈ నెల 20కు హైకోర్టు వాయిదా వేసింది. మరోవైపు క్రాస్ ఎగ్జామిన్ కు గైర్హాజర్ అయినందుకు బండికి న్యాయస్థానం రూ. 50 వేల జరిమానా విధించిందని వార్తలు వచ్చాయి.
ఆ వార్తలను బండి సంజయ తరఫు న్యాయవాది కరుణా సాగర్ ఖండించారు. బండి సంజయ్ కు హైకోర్టు ఎలాంటి జరిమానా విధించలేదన్నారు. ఇటీవల పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఒక సారి, అంతకు ముందు అమెరికా పర్యటన నేపథ్యంలో మరోసారి బండి సంజయ్ క్రాస్ ఎగ్జామిన్ కు హాజరు కాలేకపోయారని తెలిపారు.
ఈ నేపథ్యంలో క్రాస్ ఎగ్జామినేషన్ కు తమకు సమయం కావాలని కోర్టును అభ్యర్థించామన్నారు. దాని కోసం కోర్టు నిబంధనల ప్రకారం సైనిక్ వెల్ఫేర్ ఫండ్ కు రూ.50 వేలను జమ చేశామని చెప్పారు. అంతే కానీ అది జరిమానా కాదని స్పష్టం చేశారు. 2018 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన సమయంలో గంగుల అవకతవకలకు పాల్పడ్డారని బండి సంజయ్ ఆరోపించారు.
ఆస్తులకు సంబంధించి గంగుల సరైన వివరాలు సమర్పించలేదని, ఎన్నికల వ్యయాన్ని ఉద్దేశ పూర్వకంగా తప్పుగా చూపించారని బండి సంజయ్ ఆరోపించారు. తద్వారా ఎన్నికల సంఘాన్ని గంగుల తప్పుదోవ పట్టించారన్నారు. ఈ మేరకు తెలంగాణ హైకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు.